పట్టుల ప్రస్థానం


పట్టు పట్టా— పదాల పసిడి తీగల్ని పలికించా,

భావాల బుట్టలో బంగారు వెలుగులు నింపా॥

గుట్టు పట్టా— గుండెల లోతుల్లో గూడు కట్టిన రహస్యాల్ని

గాలికి గుసగుసలుగా చెప్పించా॥


మట్టు పెట్టా— మాటల మేడల్లో మలినాల్ని మరుగునపెట్టా,

మానవత్వం మొలకెత్తే నేలను సిద్ధం చేసా॥

తూటా పట్టా— అవినీతిపరుల ఆట కట్టించా,

సత్యం తాకే చోటే లక్ష్యమయ్యా॥


బాట పట్టా— బాటసారిగా భావాల మార్గం ఎంచా,

బంధాల దారుల్లో వెలుగులు విరజిమ్మా॥

మాట పట్టా— మాటలో మాధుర్యం మిగిలేలా చూసా,

మానసాల్ని ముద్దాడే మంత్రమై నిలిచా॥


చేయి పట్టా— చేయి పట్టి చీకట్లను దాటించా,

చెలిమి చిగురించే చెట్లు నాటా॥

కాలు పట్టా— కాలానికి కట్టుబడి ముందడుగు వేసా,

కల్పనలకు కంచె దాటే ధైర్యం ఇచ్చా॥


గొంతు పట్టా— గుండె గుసగుసల్ని గానం చేసా,

గాత్రంలో గాఢతను నింపా॥

చెవి పట్టా— చిన్న చప్పుళ్లను కూడా వినిపించా,

చెదిరిన మనసుల్ని చక్కబెట్టా॥


జుట్టు పట్టా— జీవిత గాలిలో ఎగిరే తంతుల్ని సర్దా,

జీవన జాలాన్ని జాగ్రత్తగా అల్లా॥

మెడ పట్టా— మెడలో మోసే బాధల్ని తగ్గించా,

మెత్తని మమతతో మోసే శక్తినిచ్చా॥


చొక్కా పట్టా— చిన్న చినుకుల్లా జారే క్షణాల్ని దాచా,

చిరునవ్వుల చొక్కాలో జ్ఞాపకాలు కుట్టా॥

గుక్క పట్టా— గుండెల గుక్కలను గీతలుగా మార్చా,

గాయాల్ని గానంలా గలగలా పారించా॥


హలం పట్టా— మనసుపెట్టి హృదయ నేల దున్నా,

హరిత స్వప్నాల్ని హరివిల్లు చేశా॥

కలం పట్టా— కలంతో కాలాన్ని కట్టిపడేసా,

కవిత్వంలో కాంతిని కలగజేశా॥


ఊపిరి పట్టా— ఊసుల్లో ఊహలను ఊరించా,

ఉనికికి ఉజ్జ్వల రూపం ఇచ్చా॥

పరుగు పట్టా— పరుగులో పరిమళం వెదజల్లా,

పలుకుల పల్లకిలో ప్రయాణం సాగించా॥


ఇలా— పట్టు పట్టిన ప్రతిదీ 

కవిత అయింది, కుసుమం అయింది,

ప్రయాణం అయ్యింది, ప్రాణం అయ్యింది…

నా కలం చేతిలో కాలమే నిలిచిపోయింది॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog