కవిత్వ వైభవాలు


వింత విరి కవిత్వం —

విరహానికీ వెన్నెలరంగు పూయిస్తుంది,

మౌనపు మడుల్లో మెల్లగా మొలిచి

మనసుకు మధురానుభూతి పంచుతుంది॥


విడ్డూర విభావము కవిత్వం—

కన్నీటిలోనూ కాంతులు వెతుకుతుంది,

గాయాల గర్భంలో గానమై పుట్టి

బాధలనైనా బంగారమై మార్చుతుంది॥


విశిష్ట వెలుగు కవిత్వం—

అక్షరాలకు ఆత్మరూపం ఇస్తుంది,

పలుకుల పుష్పాల్లో పరిమళమై నిలిచి

పాఠక హృదయాల్లో పావనమవుతుంది॥


విశేష వైభవము కవిత్వం—

కాలాన్నికూడా కట్టిపడేస్తుంది,

ఒక చిన్న పాదంలోనే విశ్వాన్నంతా

ఊహలతో ఊయలలూపిస్తుంది॥


విన్నూతన వికాసము కవిత్వం—

ప్రతి భావానికి కొత్త బాట వేస్తుంది,

నిశ్శబ్దానికీ స్వరమై నిలిచి

నిత్యనూతన సత్యాలను పలికిస్తుంది॥


విస్మయ విజృంభణ కవిత్వం—

చుక్కలతో చీర అల్లినట్లుంటుంది,

అక్షరాల ఆకాశంలో ఆత్మను ఎగరేసి

అనంతానందాల్ని అందిస్తుంది॥


విచిత్ర విభాతము కవిత్వం—

నవ్వుల్లోనూ నిశ్వాసాల్లోనూ నడుస్తుంది,

కలలకీ కన్నీళ్లకీ కలయికై

జీవితాన్ని జాజివనమై మార్చుతుంది॥


వైశేషిక వెలివరింత  కవిత్వం—

వాక్యాల్లో విలువలను నాటుతుంది,

మానవ హృదయాల మధ్య మమతల

మంగళసేతువై నిలిచిపోతుంది॥


అందుకే కవిత్వమంటే— వింత విశ్వవీణగానం,

విశేషాల వెలుగుల్లో విస్మయరాగం,

విచిత్ర భావాలకు వైశేషిక రూపం,

విన్నూతన హృదయాలకు నిత్యానురాగం॥


కవిత్వాన్ని ఆహ్వానించండి,

కవితామృతాన్ని ఆస్వాదించండి,

కవనరాగాలను ఆలకించండి,

కవులను అభినందించండి॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం.


Comments

Popular posts from this blog