నేను…
నేను…
అక్షరాల్లో అగపడతా —
అరుణోదయ కిరణంలా ఆత్మల్ని అలరిస్తా,
అమృతధారలై అలసిన హృదయాల్లో జారిపడతా॥
నేను…
పదాల్లో ప్రవహిస్తా —
పర్వతాల పొంగులా పరవళ్ళు తొక్కుతా,
పల్లె గాలిలో పాటై పసిహృదయాల్ని పలకరిస్తా॥
నేను…
ఊహల్లో ఊరిస్తా —
ఉయ్యాలలూపే వెన్నెలవై విరిసిపోతా,
ఉన్నట్టుండి మనసు మట్టిలో మల్లెలై మొలకెత్తుతా॥
నేను…
భావాల్లో భాసిల్లుతా —
భానుడి బంగారు వెలుగులా బతుకులను నింపుతా,
భక్తిలో భజనై, ప్రేమలో పరిమళమై పరుచుకుంటా॥
నేను…
అంతరంగాలను ఆకట్టుకుంటా —
అనుభూతుల అంచులపై ఆత్మీయతగా నర్తిస్తా,
అలజడుల అలల మధ్య ఆశల దీపమై నిలుస్తా॥
నేను…
హృదయాలను అంటుకుంటా —
హంసనాద స్వరంలా హాయిగా హత్తుకుపోతా,
హరివిల్లుల రంగులై హృదయవీధుల్లో విహరిస్తా॥
నేను…
గుండెల్లో గుభాలిస్తా —
గులాబీ సువాసనై గుబాళింపులు పంచుతా,
గాయాల గర్భంలో గంగాజలమై గుండెల్ని శాంతింపజేస్తా॥
నేను…కవితల్లో కనిపిస్తుంటా —
కాలానికీ కలానికీ కలువనై కలిసిపోతా,
కన్నీటి చుక్కలో కాంతినై,
నవ్వుల నదిలో నావనై నడుస్తుంటా॥
నేను… మాటల మకరందమై
మానవత్వపు మల్లెల్ని వికసింపజేస్తా,
భావాల భువనంలో భానుకిరణమై
భావాల భువనంలో భానుకిరణమై
సాహిత్య గగనంలో శాశ్వతంగా వెలుగుతుంటా॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment