కవిభావాలు


కవిభావాలు రాతల్లో —

కమ్మని అక్షరాలై వెలుగుతాయి,

కాగితపు గుండెల మీద

కలల చిత్రాలై నిలిచిపోతాయి॥


కవిభావాలు చేతల్లో —

కలం కొనలపై కావ్యసుధలను కురిపిస్తాయి,

అక్షరాలకు ప్రాణం పోసి

అమృతకావ్యాలై కలకాలం నిలిచిపోతాయి॥


కవిభావాలు కోతల్లో —

కొత్త అర్థాలు తొణికిసలాడుతాయి,

చతురమైన చమత్కృతుల్లో

చప్పట్ల హారాలు అందుకుంటాయి॥


కవిభావాలు గీతల్లో —

గానసుధలై ప్రవహిస్తాయి,

రాగాల రమ్య తరంగాల్లో

రసహృదయాలను రంజింపజేస్తాయి॥


కవిభావాలు వెతల్లో —

అందాలను వెదకి అక్షరాల్లో ఆవిష్కరిస్తాయి,

జీవిత సత్యాల జాడలను

జగతికి జ్యోతులుగా నిలుపుతాయి॥


కవిభావాలు మోతల్లో —

మేలుకొలుపు ఘంటికలై మ్రోగుతాయి,

నిద్రాణమైన మనసులను

నూతన మార్గాల వైపు నడిపిస్తాయి॥


కవిభావాలు కూతల్లో —

కోయిల కంఠమై కుహూకుహూమంటాయి,

ప్రకృతి పరవశ గానాలలో

ప్రేమ సందేశాలు వినిపిస్తాయి॥


కవిభావాలు కైతల్లో —

కమ్మని భావాలు విరబూస్తాయి,

రసరంజిత పదసుమాలతో

రసికహృదయాలను రంజింపజేస్తాయి॥


కవిభావాలు ఎక్కడున్నా —

మానవతా మకరందాలే,

మనసున్న చోట మొలిచే

మధురానుభూతుల మందారాలే॥


కవిభావాలు అన్నివేళలా —

అక్షరాలకు ఆత్మగా నిలుస్తాయి,

జనహితమే లక్ష్యమై

జగతిని జాగృతం చేస్తాయి॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog