చేతల్లో చాటుతా! రాతల్లో పెడతా!
చేస్తా — చెప్పకుండా చేస్తా,
చిత్తశుద్ధిని చాటుతూ చాటింపు లేకుండా చేస్తా,
అవసరాన్ని గ్రహించి అడగకుండానే చేస్తా॥
చేస్తా — నచ్చితేనే చేస్తా,
న్యాయం తోడైతే నిర్భయంగా ముందుకొచ్చి చేస్తా,
నిబద్ధతతో మాటకు విలువ తెస్తా, నమ్మకంగా చేస్తా॥
చేస్తా — చక్కగా చేస్తా,
నైపుణ్యంతో మెప్పులను అందుకుంటా,
తప్పిదాలకు తావులేక సరిగానే చేస్తా, సఫలతను సాధిస్తా॥
చేస్తా — సరదాగా చేస్తా,
సంతోషాలను పంచుతూ సాగిపోతూ ఉంటా,
కర్తవ్యాన్ని భుజాన మోస్తా, అంకితభావంతో పూర్తిచేస్తా॥
చేస్తా — నాలాగా చేస్తా,
నా ముద్రతో నవ్యతను నింపుతా,
గుండెల్లో నిలిచి గుర్తుండేలా చేస్తా, కీర్తిగా మిగులుతా॥
చేస్తా — భారమైనా చేస్తా,
బరువును బలంగా మార్చి విజయపథం చేరుతా,
ఆటంకాలను దాటి కష్టమైనా చేస్తా, సుసాధ్యం చేస్తా॥
చేస్తా — ఖర్చైనా చేస్తా,
మంచి పనికి వెచ్చించి మానవతను చాటుతా,
కాలపాలనతో కచ్చితంగా చేస్తా, మచ్చలేక పూర్తిచేస్తా॥
చేస్తా — మరవకుండా చేస్తా,
మదిలో నిలుపుకొని నెరవేర్చుతూ ఉంటా,
మనసుపెట్టి చేస్తా, మమతతో ప్రాణం పోసి చేస్తా॥
చేస్తా — వట్టిగా చేస్తా,
వంచనలు లేక ఉన్నది ఉన్నట్టు చెబుతా,
గమ్యంపై గురిపెట్టి గట్టిగా ముందుకు సాగుతా॥
చేస్తా — మేటిగా చేస్తా,
మేలిమితో చిరస్మరణీయమవుతా,
ధైర్యాన్ని తోడుగా చేసుకొని గెలుపును చేరుతా॥
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment