అక్షరాలతో ప్రయాణం


అక్షరాలతో అల్లుతుంటా — అందాల హారముగా,

అనుభూతుల పూలను గుచ్చి నవమాలికగా;

అక్షరాలతో గిల్లుతుంటా — మనసును తట్టేలాగా,

మరుగు పడిన భావాలను మేల్కొలిపేలాగా॥


అక్షరాలతో హత్తుకుంటా — మమతల మేఘముగా,

మనసంతా చల్లదనాన్ని నింపే వానజల్లుగా;

అక్షరాలతో ముట్టుకుంటా — మల్లెల వెన్నెలగా,

మధురానుభూతులను నింపే మకరందంగా॥


అక్షరాలతో ఆడిస్తుంటా — ఊహల ఊయలగా,

ఇంద్రధనుస్సు రంగులలో విహరించే విహంగముగా;

అక్షరాలతో పాడిస్తుంటా — రాగాల రంజకముగా,

రసరమ్య గీతాలను పలికించే వాద్యముగా॥


అక్షరాలతో చదివిస్తుంటా — జ్ఞానదీపికగా,

చీకటిని పారద్రోలే చైతన్య జ్యోతిగా;

అక్షరాలతో కదిలిస్తుంటా — కరుణా తరంగముగా,

కఠిన హృదయాలనుకూడా కరిగించే స్రవంతిగా॥


అక్షరాలతో అలరిస్తుంటా — ఆనంద వెల్లువగా,

అంతరంగ వీధులలో విరిసే వసంతముగా;

అక్షరాలతో ఆహ్వానిస్తుంటా — ఆత్మీయ బంధముగా,

అందరినీ ప్రేమబాటలో నడిపించే దీపముగా॥


అక్షరాలతో మేల్కొలుపుతా — అరుణోదయ తేజముగా,

అక్షరాలతో విహరించుతా — భావాల సౌధముగా;

అక్షరాలతో నిలిచిపోతా — పాఠక హృదయసీమగా,

అక్షరాలతో వెలిగిపోతా — కవితా కుసుమముగా॥


అక్షరాలే శ్వాసగా — అక్షరాలే ధ్యేయముగా,

అక్షరాలే జీవనంగా — అక్షరాలే ప్రాణముగా;

అక్షరాలతో పయనిస్తుంటా — అనంత విహాయసముగా,

అక్షరాలతో శయనిస్తుంటా — మధుర స్వప్నముగా॥


✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం ✍️



Comments

Popular posts from this blog