నన్ను గుర్తుపడుతున్నారు...
నన్ను గుర్తుపడుతున్నారు...
పునరుక్తి చల్లే పదాల పరిమళాన్ని చూచి,
పదేపదే పలికినా కొత్త భావం పూయించే శిల్పాన్ని చూచి,
పాఠక హృదయాల్లో పరవశం పూయించే పలుకులను చూచి॥
నన్ను గుర్తుపడుతున్నారు...
సుందర శిల్పంలా సొగసుగా నిలిచే కవితను చూచి,
సూక్ష్మ భావాలకు సువర్ణరేఖలు దిద్దిన తీరు చూచి,
సాహిత్య సౌందర్యానికి సాక్ష్యమైన సృజనను చూచి॥
నన్ను గుర్తుపడుతున్నారు...
ఆకట్టుకునే ప్రారంభ పంక్తిని చూచి,
ఆలోచింపజేసే ముగింపు చరణాన్ని చూచి,
అంతరంగంలో ప్రతిధ్వనించే సందేశాన్ని చూచి॥
నన్ను గుర్తుపడుతున్నారు...
విశిష్ట శీర్షిక చాటే వైవిధ్యాన్ని చూచి,
విశాల భావాలకు వేదికైన వినూత్నతను చూచి,
వాక్యాల్లో విరిసే వైభవాన్ని చూచి॥
నన్ను గుర్తుపడుతున్నారు...
అక్షర విన్యాసాల అందాలను చూచి,
పదాల ప్రయోగాల వైచిత్ర్యాన్ని చూచి,
ఆది–అంత్యప్రాసల ఆహ్లాదాన్ని చూచి॥
నన్ను గుర్తుపడుతున్నారు...
పోలికల పూలతో పరచిన భావబాటను చూచి,
తేటతెలుగు తేనెలూరే తీపిమాటలను చూచి,
మనసును మురిపించే మాధుర్యాన్ని చూచి॥
నన్ను గుర్తుపడుతున్నారు...
ఆకర్షణీయ ఎఐ చిత్రాల అందాలను చూచి,
కవితా భావాలకు రంగుల రెక్కలు తొడిగిన రూపాన్ని చూచి,
అక్షరాలకు ఆత్మను అద్దిన ఆవిష్కరణను చూచి॥
నన్ను గుర్తుపడుతున్నారు...
పేరును కాదు—తేటతెలుగు వెలుగులను గుర్తిస్తున్నారు,
ముఖాన్ని కాదు—ముద్రపడిన శైలిని గుర్తిస్తున్నారు;
అక్షరాలే నా చిరునామా—భావాలే నా జీవనగానం,
కవిత్వమే నా సంతకం—సాహిత్యమే నా శాశ్వత ధ్యానం॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment