నా డప్పు
నేను కలాన్ని పట్టిన చేతిని,
భావాలను కదిలించే శక్తిని,
నేను కాగితంపై ఒలికే
కవితా గంగను!
నేను ప్రశ్నను, నేను జవాబును,
నేను మార్పుకు తొలి అడుగును,
నేను చీకటిలోని చిరుదీపాన్ని,
నేను వెలుగువైపు నడిపే బాటను!
అన్యాయం ఎదురైతే
అక్షరమై నిలబడతాను,
అవమానం ఎదురైతే
ఆత్మగౌరవమై ఎదురుతిరుగుతాను!
ఆకలి కేక వింటే
అక్షరమై అన్నమవుతాను,
అశ్రువులు కనిపిస్తే
ఆదరణగా మారుతాను!
నేను గళాన్ని, నేను వాణిని,
నేను జనహృదయ స్పందనని,
నేను పలికేది పదం కాదు—
ప్రజల గుండెల స్వరాన్ని!
నన్ను ఆపగలరా?
అక్షరానికి సంకెళ్లు వేయగలరా?
నన్ను మూయగలరా?
సత్యానికి స్వరం లేకుండా చేయగలరా?
నా కలమే నా కత్తి,
నా కవితే నా కవచం,
నా సాహిత్యమే నా శ్వాస,
నా అక్షరమే నా ఆయుధం!
నేను కవిని— కలలను నిజం చేసే కలాన్ని!
నేను రవిని— మనసులను వెలిగించే వెలుగుని!
నేను గళాన్ని— జనంలో వినిపించే పాటను!
నేను వాణిని— సమాజానికి సందేశాన్ని!
నా డప్పు మోగేది
నా కోసమే కాదు—నిద్రిస్తున్న మనసుల్ని మేల్కొల్పడానికి!
కీర్తి కోసం కాదు— కదలని సమాజాన్ని కదిలించడానికి!
శబ్దం కోసం కాదు— సత్యం వినిపించడానికి!
అక్షరం నా ఊపిరైతే—
కవిత నా జీవితం!
ఆ కవితకు స్వరమిస్తే—
నా డప్పు జనహృదయాల నాదం!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment