ఓ మయూరీ


పురివిప్పి పరవశించి నాట్యమాడవే మయూరీ 

పులకించిన మదికి ఆనందమివ్వవే మయూరీ


మేఘాలు పెళపెళ గర్జించగనే మురిసిపోతూ 

చక్కనైన అందాలను చూపించవే మయూరీ


చినుకుల చిటపటలు వింటూ చిలిపిగా రెక్కలూపి

చెలరేగుతూ హృదయాలను దోచవే మయూరీ


నీలాకాశం నీకొరకు నీలి తెరను పరచగా

కాంచి నాట్యమాడి కనువిందు చేయవే మయూరీ


వెన్నెలలో విరిసే నీ వయ్యారపు నడకలతో

వెలుగులు చిందిస్తూ ముందుకు సాగవే మయూరీ


పచ్చని వనమంతయూ పరిమళాలతో నిండగా

పరువాలు చూపుతూ కూతలు వేయవే మయూరీ


ఇంద్రధనస్సు రంగులు రెక్కలపై ధరించినట్లు

ఇంపైన సప్తవర్ణాలతో మెరవవే మయూరీ


కవిగుండె భావాలను శ్రావ్య గీతాలుగా మార్చి 

కవితలకు కమ్మని సొబగులను అద్దవే మయూరీ


రాజేంద్రుని కలలలోన రసమయమైన రూపమై

రాగాలను రమ్యంగా పలికించవే మయూరీ


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog