నా రాతలు కోతలు
పద పొసగులతో మనసులు దోచాలని రాస్తున్నా
ప్రాస లయలతో సొగసులు చూపాలని రాస్తున్నా
కమ్మనైన కోయిలకంఠాలు కలిగిన గాయకులు
శ్రావ్యమైన గేయాలను పాడాలని రాస్తున్నా
తెలుగునేలన పూలతోటలలో కోకొల్లలుగా
అందమైన ప్రసూనాలు పూయాలని రాస్తున్నా
మధుమాసం రాకతెలుపుతూ మొగ్గలు తొడిగి విరిసి
మరుమల్లెల పరిమళాలు వీచాలని రాస్తున్నా
కష్టాల్లో చిక్కినవారికి చేదోడుగా నిలిచి
కన్నీటికి ఓదార్పుగ నిలవాలని రాస్తున్నా
మానవతా మధురభావం మనసులలో నింపుతూ
ప్రేమనే బంధంతో బిగించాలని రాస్తున్నా
భారత బాషలందు బంగరునగగా తెలుగుకవులు
రవికిరణాలై వెలుగులు చిమ్మాలని రాస్తున్నా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment