ఒక నవ్వు చాలు


ఒక నవ్వు చాలు

వాడిన మనసులో వసంతాలు పూయించడానికి,

ఒక నవ్వు చాలు

కన్నీటి చారలను కాంతులుగా మార్చడానికి.


మాటలకందని మమతను

మౌనంగా చెప్పగలదు ఒక నవ్వు,

దూరమైన హృదయాలను

దగ్గరకు చేర్చగలదు ఒక నవ్వు.


అలసిన అడుగులకు

ఆశల బాటను చూపగలదు ఒక నవ్వు,

ఓడిపోయిన మనిషిలో

మళ్లీ గెలవాలనే ధైర్యాన్ని నింపగలదు ఒక నవ్వు.


పరిచయం లేని మనిషికైనా

పలకరింపుగా మారుతుంది ఒక నవ్వు,

పరాయివాడనుకున్న మనసుకైనా

ఆత్మీయతను పంచుతుంది ఒక నవ్వు.


నవ్వుంటే ధనం ఖర్చు చేయనక్కరలేదు,

దానం చేయడానికి చేతులు అవసరం లేదు,

హృదయం తెరిచి నవ్వును పంచితే చాలు—

ఎదుటివారి గుండెలో వెలుగులు నింపుతుంది ఒక నవ్వు.


కోపంతో మూసుకున్న తలుపులకు

చిరు తాళంచెవిగా మారుతుంది ఒక నవ్వు,

చీకటిలో చిక్కుకున్న జీవితానికి

చిన్న దీపమై దారి చూపుతుంది ఒక నవ్వు.


విరిగిన బంధాలను మళ్లీ కలిపే వంతెనై,

విడిపోయిన మనసులను దగ్గర చేసే బంధమై,

ఎడబాటున కరిగించే ఆత్మీయ పలకరింపై,

ఎన్నో హృదయాలకు ఓదార్పవుతుంది ఒక నవ్వు.


మనిషి సంపాదించే సంపదలన్నిటిలో

మరిచిపోలేని సంపద ఒక నవ్వు,

మనిషి ఇచ్చే కానుకలన్నిటిలో

మరువలేని కానుక ఒక నవ్వు.


నవ్వడం నేర్చుకున్న హృదయం

బాధల్లోనూ బతకగలదు,

నవ్వును పంచే మనిషి

నలుగురి హృదయాల్లో నిలిచిపోగలడు.


అందుకే— నవ్వు పెదవులపైనే కాదు,

మనసులోనూ పూయనీ…

మన నవ్వుతో మరొకరి జీవితం

ఒక్క క్షణమైనా వెలిగిపోనీ!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog