కవిత్వం వండితే


కలమనే గరిటెతో

కాగితమనే పాత్రలో

మనసనే వంటగదిలో

కవిత్వం వండితే...


చదివేవారి హృదయాలకు

తియ్యని విందవుతుంది,

ఆస్వాదించే మనసులకు

మరపురాని రుచవుతుంది.


భావం బాగా ఉడికితే

కవిత్వం రుచికరమవుతుంది,

మనసుతో వండిన కవిత

మదిలో నిత్యం నిలిచిపోతుంది.


అక్షరాలను తరిగితే

పదాలుగా మారుతాయి,

పదాలను కలిపితే

వాక్యాలు తయారవుతాయి.


మనసును పొయ్యిచేసి

మమతను మంటచేసి

ప్రేమను నెయ్యి పోసి

పదాలకు తాలింపు వేస్తే...


ఊహలను ఉప్పుగా వేసి

అనుభూతులను కారం చేసి

ఆనందాలను చక్కెర చేసి

కవితకు రుచి తెస్తే...


భావాలను ఏరుకుంటే

పదార్థాలు సిద్ధమవుతాయి,

ఆలోచనలను కలిపితే

రుచులు కుదురుతాయి.


ప్రాసలను పోపులుగా వేసి

లయలను కలుపుకుంటే

భావాల పరిమళాలతో

కవిత్వం ఘుమఘుమలాడుతుంది.


ఆప్యాయతను అమృతబిందువులుగా,

చిరునవ్వులను తేనెలుగా,

సరసాలను రుచులుగా చేసి,

వర్ణిస్తే విందవుతుంది.


మమతలతో వడ్డిస్తే

మనసులన్నీ మెచ్చుకుంటాయి,

ప్రేమతో వండిన కవిత

హృదయాలలో నిలిచిపోతుంది.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog