మనమడి ముచ్చట్లు 


ముద్దుల మనమడు — మురిపించే మనమడు,

ముచ్చట్ల మనమడు — మురిసే మనమడు,

మొగ్గల నవ్వులతో మెరిసే మనమడు,

ముంగిట వసంతమై విరిసే మనమడు!


అల్లరి మనమడు — ఆడే మనమడు,

అడుగడుగునా ఆటలాడే మనమడు,

అందరి గుండెల్లో ఆనందమయ్యే మనమడు,

అలసిన ఇంటికే ఉత్సవమయ్యే మనమడు!


టక్కరి మనమడు — తుంటరి మనమడు,

తాత మాటకే ఎదురు తిరిగే మనమడు,

తప్పుచేసినా తీయగా నవ్వే మనమడు,

తన చిలిపితనంతో గెలిచే మనమడు!


భుజాలెక్కే మనమడు — బుజ్జి మనమడు,

భుజాలనే గుర్రమని భావించే మనమడు,

“ఇంకా ఎత్తుకు...” అంటూ అడిగే మనమడు,

ఎదలోని ప్రేమను ఎత్తుకెళ్లే మనమడు!


గోలచేసే మనమడు — గారాబాల మనమడు,

గలగల నవ్వులతో సందడి చేసే మనమడు,

గొంతు వినిపించకుంటే వెలితిచేసే మనమడు,

గృహమంతా నిశ్శబ్దం చెదరగొట్టే మనమడు!


బిస్కత్తులడిగే — బుజ్జి మనమడు,

“ఇంకొకటి తాతా!” అంటూ అడిగే మనమడు,

చేతిలో తీపితో చిందులేసే మనమడు,

చిన్న కోరికతో చెలిమి పెంచే మనమడు!


చాక్లెట్లు కోరే — చిలిపి మనమడు,

చక్కని మాటలతో మురిపించే మనమడు,

చాక్లెట్ కన్నా తీయగా నవ్వే మనమడు,

చుట్టూ హృదయాల్ని దోచే మనమడు!


గంతులేసే మనమడు — గోలచేసే మనమడు,

గదులన్నీ తిరిగే గాలివాన మనమడు,

గడప దాటగానే గలగల మనమడు,

గుండెల్లో ఆనందం నింపే మనమడు!


కబుర్లు చెప్పే — కలల మనమడు,

కథలు చెప్పమని కోరే మనమడు,

కమ్మని మాటలతో కట్టిపడేసే మనమడు,

కరిగిన బాల్యాన్ని తిరిగితెచ్చే మనమడు!


తాత ఒడిలో తారక మనమడు,

అమ్మమ్మ గుండెలో అమృతము మనమడు,

ముడతల ముఖాలను మురిపించే మనమడు,

ముసలితనానికే బాల్యమిచ్చే మనమడు!


మనమడు ఉంటే — ఇల్లే పండుగ,

మనమడు నవ్వితే — గుండెల్లో విందు,

మనమడు పిలిస్తే — వయసే మరుపు,

మనమడు అంటే — జీవితపు వరము!


వంశవృక్షాన విరిసిన వసంతము మనమడు,

వృద్ధ హృదయాల వెలుగైన దీపము మనమడు,

తరతరాల ప్రేమకు తీయని వారధి మనమడు,

తాతా నానమ్మల జీవితానికి తిరిగొచ్చిన బాల్యము — మనమడు!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog