కాస్త ప్రేమించు
కాస్త ప్రేమించు పక్కన ఉన్నవారిని,
నీ పలకరింపుతో వారికి పండుగవ్వాలి,
చిరునవ్వుతో పంచు కాస్త ఆప్యాయతను,
ప్రేమతో నింపు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని.
కాస్త ప్రేమించు పరవశపరచే ప్రకృతిని,
పూల పరిమళాన్ని, పక్షుల గానాన్ని,
చెట్ల నీడలో దాగిన చల్లని మమతను,
ఆస్వాదించు ప్రకృతి ఒడిలోని మధురిమను.
కాస్త ప్రేమించు హృదయాన్ని అర్పించేవారిని,
నీ కోసం నిలిచే నిస్వార్థ హృదయాలను,
నీ బాధలో తోడై, నీ సంతోషంలో నవ్వి,
నీ జీవితానికి అండగా నిలిచే బంధాలను.
కాస్త ప్రేమించు ఆప్యాయతతో అలరించేవారిని,
ఒక మంచి మాటతో మనసు గెలిచేవారిని,
చిరునవ్వుతో చీకటిని తొలగించేవారిని,
నీ దారిలో వెలుగులు పంచే మనుషులను.
కాస్త ప్రేమించు జీవితంలో అండగా నిలిచేవారిని,
విజయంలో చప్పట్లు కొట్టేవారినే కాదు,
నీ వైఫల్యంలోనూ చేయి విడవనివారిని,
నీ కన్నీటిలో కన్నీటిగా నిలిచేవారిని.
కాస్త ప్రేమించు కష్టాల్లో ఉన్నవారిని,
వారి కన్నీటి వెనుక బాధను గమనించు,
చేయూత ఇవ్వలేకపోయినా ఓదార్పు ఇవ్వు,
నీ మానవత్వంతో వారి ఆశను నిలుపు.
కాస్త ప్రేమించు మానవత్వం చూపేవారిని,
మంచితనాన్ని మౌనంగా పంచేవారిని,
ప్రేమ పంచితే ప్రేమే తిరిగి వస్తుందని,
మనిషితనమే జీవితానికి అందమని చాటి చెప్పు.
ప్రేమ పంచితే తరగదు, ఆప్యాయత చూపితే తగ్గదు,
చిరునవ్వు ఇస్తే మనసుల్లో వెలుగు నిండుతుంది,
ఈ చిన్న చిన్న “కాస్త”లే పెద్ద మార్పులు తెస్తాయి,
మమత పంచిన లోకమే మానవతా లోకమవుతుంది!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment