పడ్డా..
కాలం వీచిన గాలికి తట్టుకోలేక,
ఆశల రెక్కలు విరిగి నేలచేరగా తూలిపడ్డా..
జీవితమనే దారిలో జాగ్రత్త తప్పి,
మాటల మలుపులో మమతను కోల్పోయి జారిపడ్డా..
తలకెక్కిన గర్వం కరిగిపోయి,
నేలతల్లి ఒడిలో నిజం తెలిసి కిందపడ్డా..
చుట్టూ తిరిగే లోకాన్ని నమ్మి,
నిజమేదో నాటకమేదో తెలియక తలతిరిగిపడ్డా..
ఓటమి నీడలో ఒంటరిగా మిగిలి,
నిరాశ నిట్టూర్పులు నీరసపరచగా సోలిపడ్డా..
పెరుగుతున్న అహంకారపు మెట్లెక్కి,
గర్వపు ఎత్తుల్లోకి ఎగసి పైనపడ్డా..
మెరిసే ప్రతి దారి మంచిదనుకొని,
ముసుగేసిన మనుషుల మాటలు నమ్మి పొరపాటుపడ్డా..
కర్తవ్యపు కడలిలో కాపలా మరిచి,
కాలం పరుగును కళ్లారా చూడక కునుకులోపడ్డా..
నీడను నిజమని, నిశ్శబ్దాన్ని ప్రేమని భావించి,
మిరుమిట్ల మెరుపులనే వెలుగనుకొని భ్రమలోపడ్డా..
దారి తెలిసినా దురాశ వెంట నడిచి,
లోభపు అడుగులతో లోతులోకి జారి గోతిలోపడ్డా..
పడిన ప్రతిసారీ ఓ పాఠం నేర్చుకున్నా,
ఎన్ని గాయాలైనా నవ్వుతూ భరించా;
పడటం ఓటమి కాదని తెలుసుకున్నా,
ప్రతిసారీ కొత్త బలంతో లేచి నిలిచా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment