పిలుపులు


ప్రకృతి పిలుస్తుంది —

పచ్చని చిగురుల పరవశంతో,

పూల పరిమళాల పలకరింపుతో,

చినుకుల చిలిపి సవ్వడితో 

రమ్మంటుంది తన ఒడిలోకి!


ప్రేయసి పిలుస్తుంది —

పెదవులపై పూసిన చిరునవ్వుతో,

కళ్లలో దాచుకున్న ప్రేమతో,

మనసులో మోగే మౌనరాగంతో

రమ్మంటుంది తన హృదయంలోకి!


పున్నమి వెన్నెల పిలుస్తుంది —

వెండితెర పరిచిన నిశీధిలో,

నక్షత్రాల నాట్యాన్ని వీక్షించమని,

చంద్రుని చల్లని కాంతిలో

మనసుకు మధురమైన మౌనం నేర్పమని!


పల్లె పిలుస్తుంది —

మట్టివాసన మమతను మోసుకొస్తూ,

పంటచేల పచ్చదనం పలకరిస్తూ,

పొద్దుపొడుపున కోడి కూతతో

పాత జ్ఞాపకాల దారిలో నడిపించమని!


పట్నం పిలుస్తుంది —

వెలుగుల వలలో కలలను బంధించి,

వేగపు పరుగుల్లో కాలాన్ని తరిమేస్తూ,

అవకాశాల ఆకాశాన్ని అరచేతిలో చూపించి,

అడుగడుగునా ఆరాటంతో ఎదగమని!


పూదోట పిలుస్తుంది —

రంగురంగుల రేకులు విప్పి,

తేనెటీగల తీయని గానంతో మురవమని,

పరిమళాల వంతెన వేసి

పరవశించి పరిమళించమని!


పెళ్లాం పిలుస్తుంది —

అలసిన అడుగులకు ఆప్యాయతనై,

ఆరిన మనసుకు అనురాగ దీపమై,

జీవితపు ఒడిదుడుకుల్లో తోడునీడై,

ఇంటినే ఇంద్రధనుస్సుగా మలచమని!


పుస్తకం పిలుస్తుంది —

చదవని లోకాల తలుపులు తెరవమని,

చరిత్రలోని మహనీయులను తలచమని,

జ్ఞానజ్యోతిని గుండెలో వెలిగించి

చీకట్లను తరిమేయమని!


పెన్ను పిలుస్తుంది —

మనసులోని మౌనాన్ని పలికించమని,

మదిలో మెదిలే భావాలకు రూపమివ్వమని,

కన్నీటిని అక్షరాలుగా మార్చి

కాగితంపై కవితగా కురిపించమని!


పిలుపులు ఎన్ని వినిపించినా —

అన్నీ ఒకే బాటను చూపిస్తాయి;

ప్రకృతి నుంచి ప్రేమ వరకు,

అక్షరం నుంచి అనుభవం వరకు

జీవితాన్ని ఆస్వాదించమని!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog