మనసు...
బంధించినా ఆగదు —
భావాల బాటలోనే సాగుతుంది,
భయపెట్టినా లొంగదు —
స్వేచ్ఛనే కోరుకుంటుంది.
తిట్టినా పట్టించుకోదు —
తన తీరునే నడుస్తుంది,
బ్రతిమాలినా మానదు —
మమత కోసం వెదుకుతుంది.
వేడుకున్నా పట్టువీడదు —
పాత జ్ఞాపకాలు వదలదు,
చెప్పినా వినదు —
చెలరేగిన ఊహలు ఆపదు.
పిలిచినా రాదు —
నచ్చిన లోకంలో విహరిస్తుంది,
పొమ్మన్నా పోదు —
పెనవేసుకున్న బంధమై నిలుస్తుంది.
చూడమన్నా చూడదు —
కనిపించని దృశ్యాలు చూస్తుంది,
వద్దన్నా వస్తుంది —
వలపుల వానై కురుస్తుంది.
మరువమన్నా మరువదు —
మధురస్మృతులను మోస్తుంది,
మౌనం వహించమన్నా మాట్లాడుతుంది —
మదిలో పాటై పలుకుతుంది.
కాలం మారినా మారదు —
కలల తీరాన్ని వదలదు,
దూరం పెంచినా తగ్గదు —
దాచుకున్న అనురాగం విడువదు.
లోకం ఆపినా ఆగదు —
తనదైన దారిలోనే వెళుతుంది,
మనసే మనిషికి మజిలీ —
మనసే మనిషిని నడిపిస్తుంది!
పిసుకుదామంటే దొరకదు,
నరుకుదామంటే చిక్కదు,
మూలనుండమంటే కూర్చోదు,
మొండికేయద్దంటే ఒప్పుకోదు.
మనసు వరమో! భారమో!
మది మిత్రమో! శత్రువో!
హృది జ్యోతియో! చీకటో!
అంతరంగం అమృతమో! విషమో!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment