పేర్లుండాలి...


మనుషులకు పేర్లుండాలి —

మనసారా పిలిచే మమతకోసం,

మనసుల్లో నిలిచే గుర్తుకోసం,

మనిషితనాన్ని తెలిపే పేర్లుండాలి!


పిలుచుకోవడానికి పేర్లుండాలి —

పలుకుల్లో ప్రేమ పూయడానికి,

పిలుపుల్లో ఆప్యాయత నిండడానికి,

పిలిచినపుడే పలికే బంధముండాలి!


వస్తువులకూ పేర్లుండాలి —

వాటి విలువను తెలియజేయడానికి,

వాటి ఉనికిని గుర్తించడానికి,

వాటికంటూ ఓ చిరునామా ఉండాలి!


ప్రతిజాతికీ పేర్లుండాలి —

జీవ వైవిధ్యాన్ని చాటడానికి,

ప్రకృతి వైభవాన్ని కాపాడడానికి,

ప్రతి ప్రాణికీ ఓ పేరుండాలి!


నదులకూ పేర్లుండాలి —

ప్రవాహంలో నాగరికతను మోసేందుకు,

తీరాల్లో తరతరాల జ్ఞాపకాలు నిలిపేందుకు,

ప్రవహించే ప్రతి జీవధారకూ పేరుండాలి!


ఊళ్లకూ పేర్లుండాలి —

ఊరి చరిత్రను చెప్పడానికి,

మన మూలాలను గుర్తుచేయడానికి,

మట్టికి మనిషికి గుర్తుగా పేరుండాలి!


కవితలకు పేర్లుండాలి —

కవిగుండెలోని భావాన్ని పలకడానికి,

అక్షరాల్లోని ఆత్మను తెలియజేయడానికి,


చదివే ముందే ఓ ప్రపంచం తెరుచుకోవాలి!


పేర్లు కేవలం పిలుపులు కావు —

ఉనికికి అవి చిరునామాలు; గుర్తింపుకు అవి గుమ్మాలు;

జ్ఞాపకాలకు అవి జాడలు —

పేరున్న ప్రతి ఉనికీ కాలంలో ఓ కథగా నిలవాలి!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments

Popular posts from this blog