తెల్లారింది...


తెల్లారింది — తెల్లారింది!

మేల్కొనండి — మెలకువతో సాగండి,

మంచి కలల రెక్కలతో ఎగరండి,

మరో కొత్త ఉదయాన్ని ఒడిసిపట్టుకోండి.


తెల్లారింది — తెల్లారింది!

కొంతదూరం నడవండి,

ప్రకృతిని చూడండి,

పచ్చనిచెట్ల పలుకులను వినండి.


తెల్లారింది — తెల్లారింది!

దినపత్రికలు చదవండి,

దేశ దిశలను తెలుసుకోండి,

లోకాన్నంతా మనసులో నింపుకోండి.


తెల్లారింది — తెల్లారింది!

ఫలహారాలు తీసుకోండి,

ఆరోగ్యాన్ని కాపాడుకోండి,

బ్రతుకును సుఖమయం చేసుకోండి.


తెల్లారింది — తెల్లారింది!

కుటుంబంతో సరదాగా గడపండి,

కలిసి కాసేపు మురిసిపోండి,

అనురాగాల దీపాలు వెలిగించండి.


తెల్లారింది — తెల్లారింది!

ఇంటిపనులు ముగించండి,

ఇంటిని అందంగా తీర్చిదిద్దండి,

ఇల్లంటేనే ఇంద్రధనుస్సని చాటండి.


తెల్లారింది — తెల్లారింది!

పనులకు పయనించండి,

పట్టుదలతో శ్రమించండి,

చెమట చుక్కలతో భవితను మలుచుకోండి.


తెల్లారింది — తెల్లారింది!

మంచిమాటలను పలకండి,

మంచితనాన్ని పంచండి,

మనిషితనంతో మనసులను గెలవండి.


తెల్లారింది — తెల్లారింది!

నిన్నటి కన్నీరు తుడవండి,

నేటి అవకాశాన్ని అందుకోండి,

రేపటి ఆశలకు రెక్కలు తొడుక్కోండి.


తెల్లారింది — తెల్లారింది!

వెలుగు మార్గంలో నడవండి,

వెలకట్టలేని జీవితాన్ని గెలవండి,

ప్రతి ఉదయాన్నీ పండుగ చేసుకోండి.


తెల్లారింది — తెల్లారింది!

నిన్నటి బాధలను నిన్నటితోనే విడిచిపెట్టండి,

నేటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి,

రేపటి ఆశలకు నేటితోనే బాటలు వేయండి!


తెల్లారింది — తెల్లారింది!

దొరికిన రోజును వృథా చేయకండి,

కాలం తలుపు తటుతుంది... తలుపులు తెరవండి,

జీవితం పిలుస్తోంది... చిరునవ్వుతో పలకరించండి!


తెల్లారింది — తెల్లార్చుకోండి!

కాలం కరిగిపోతుంది,

జీవితం జారిపోతుంది,

రోజును వెలుగుగా మార్చుకోండి!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog