కురవాలి...!
చినుకులు కురవాలి
చెట్లు చిగుర్లు తొడిగేలా,
ఎండిన నేల గుండెలు నవ్వేలా,
ప్రాణవాయువు పుడమంతా పరిమళించేలా.
నవ్వులు కురవాలి
నాలుగు దిక్కులు నిండేలా,
నైరాశ్యపు నీడలు తొలగేలా,
నరనరానా ఆనందం పొంగేలా.
కాంతులు కురవాలి
కలల దారులు వెలిగేలా,
చీకటి తెరలు తొలగిపోయేలా,
చైతన్య దీపాలు ప్రతి గుండెలో వెలిగేలా.
వెన్నెల కురవాలి
వేదనలు కరిగేలా,
విరహాలు వీడేలా,
మమతామృతం మనసులపై చల్లేలా.
డబ్బులు కురవాలి
దరిద్రపు కన్నీళ్లు తుడిచేలా,
ఇండ్లలో ఆకలిని తరిమేసేలా,
అన్నపూర్ణ నవ్వులు పూసేలా.
ఆనందభాష్పాలు కురవాలి
కల నెరవేరిన క్షణంలా,
కన్నుల కొసల నుంచి ధారలా,
కన్నీరు కస్తూరి పరిమళమై జాలువారేలా.
ప్రేమ కురవాలి
పగతో పగిలిన గుండెల మధ్య పూలవంతెనలా,
మనిషి మనిషిని మనసారా చేరుకునేలా,
మమత మల్లెల పరిమళమై లోకమంతా పరచేలా.
కరుణ కురవాలి
కన్నీటి చారలపై కాంతి చల్లే మేఘంలా,
పడిపోయినవాడిని ఆప్యాయంగా లేపేలా,
దైవత్వం నిశ్శబ్దంగా పలికేలా.
మంచితనం కురవాలి
మట్టి మనుషుల మధ్య మానవత్వపు వర్షంలా,
లోకం నిండా ప్రవహించే నదిలా,
మనుషులు మరింత ఎత్తుకు ఎదిగేలా.
అక్షరాలు కురవాలి
అజ్ఞానపు చీకట్లు చెదిరేలా,
ప్రతి బిడ్డ చేతిలో కలం కదిలేలా,
భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా.
కవితలు కురవాలి
కలతల గుండెల్ని తాకేలా,
మానవత్వపు మాధుర్యాన్ని పంచేలా,
మట్టి మనసుల్లో మమతా విత్తనాలు నాటేలా.
ఈ భూమి మీద కురవాలి... కురవాలి...!
మనిషితనం పచ్చగా నిలిచేంతవరకు—
మంచి ఆలోచనలు వానలై, మంచి మనసులు మేఘాలై,
మంచి మాటలు చినుకులై నిరంతరం కురవాలి!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment