కవితా మనసు
కవిత రాసేటపుడు —
కలలన్నీ కలాలవుతాయి,
భావాలన్నీ పదాలవుతాయి,
మౌనాలన్నీ పాటలవుతాయి,
మనసులో కవిత పుడుతుంది!
కవిత చదివేటపుడు —
అక్షరాలన్నీ అద్దాలవుతాయి,
అనుభూతులన్నీ అలలవుతాయి,
ఊహలన్నీ రెక్కలు తొడుగుతాయి,
మనసు కొత్త లోకమవుతుంది!
కవిత వినేటపుడు —
పదాలన్నీ స్వరాలవుతాయి,
స్వరాలన్నీ సుమధురమవుతాయి,
మాటలన్నీ మమతలవుతాయి,
మనసంతా మురిసిపోతుంది!
కవిత నచ్చినపుడు —
ఒక్కొక్క పదమే ముత్యమవుతుంది,
ఒక్కొక్క భావమే పరిమళిస్తుంది,
ఒక్కొక్క పాదమే జ్ఞాపకమవుతుంది,
కవిత హృదయానికి చేరుతుంది!
కవిత మనసుతట్టినపుడు —
అక్షరం కన్నీటిబొట్టవుతుంది,
భావం గుండె చప్పుడవుతుంది,
పద్యం ప్రాణస్పందనవుతుంది,
కవిత మనిషిలో నిలిచిపోతుంది!
కవిత రాసిన క్షణం —
కవికి అది తన ఊపిరి;
చదివిన క్షణం —
పాఠకునికి అది తన అనుభూతి!
విన్న క్షణం —
శ్రోతకు అది మధురస్మృతి;
మనసుతట్టిన క్షణం —
కవిత కాదు… మనసే కవితవుతుంది!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment