చానా చానా...
చానా రాస్తా —
చందమామను పదాల్లో దాస్తా,
చిగురాకుల సొగసును చూపిస్తా,
చిలకల పలుకులను వినిపిస్తా,
చిరునవ్వుల పూలను పూయిస్తా!
చానా చెబుతా —
చక్కని మాటలను చెబుతా,
చెదరని జ్ఞాపకాలను వివరిస్తా,
చెలిమి విలువలను తెలుపుతా,
చెదరని ప్రేమను పంచుతా!
చానా చూపిస్తా —
ప్రకృతి అందాలను చూపిస్తా,
పూల పరిమళాలను చల్లుతా,
ప్రభాత కిరణాలను చిమ్ముతా,
పులకించే లోకాన్ని కనబరుస్తా!
చానా పాడుతా —
పక్షుల్లా పాటలు పాడుతా,
పసిగాలి రాగాలు తీస్తా,
పరిమళించే భావాలు వినిపిస్తా,
పదాలకే ప్రాణం పోసి ఆలపిస్తా!
చానా నవ్విస్తా —
చిన్నచిన్న సరదాలతో నవ్విస్తా,
చిలిపిచిలిపి మాటలతో ఆటపట్టిస్తా,
చిరునవ్వుల వెలుగులు పంచుతా,
చీకటి మనసుల్ని వెలిగిస్తా!
చానా చానా
రాయాలని, చెప్పాలని కలలుకంటున్నా,
పాడాలని, పంచాలని ఎదురుచూస్తున్నా...
మనసున్నంతకాలం — ఊపిరున్నంతకాలం
మంచినే చాటుతుంటా చానా చానా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment