Posts

Image
 వర్షం మబ్బుల మదిలో మధురమైన మౌనమై మెరుపుల పెదవిపై వెండి దరహాసమై చినుకుల చేతిలో చిలిపైన తాళమై వర్షం వసుధకు వరమై కురిసె ఎండల ఎడారికి ఎర్రని ఆశై ఎండిపోయిన నేలకు పచ్చని శ్వాసై వాడిన వృక్షాలకు జీవపు జల్లై వర్షం కురిసెను వసంతం వలె! చెట్టు కొమ్మల్లో చిలకల పాటలు చెరువు గట్టుల్లో అలల ఆటలు మట్టి పరిమళం మదిని మైమరపించగా చినుకుల సవ్వడి సంగీతమయ్యె! గుడిసె కప్పుపై గలగల పాటై గుమ్మం ముందర గువ్వల ఆటై వాకిలి దాటే పిల్లల నవ్వై వర్షం ఆనందమై నిండె రైతన్న కళ్లలో వెలిగే కలగా పొలాల గుండెలో పండే పంటగా విత్తనాల నడుమ మొలకై ఎదిగి వర్షం జీవన గీతంగా మారె ప్రేమిక హృదయంలో తీయని జ్ఞాపకమై విరహి గుండెలో కన్నీటి బిందువై కవితా హృదయంలో భావాల ప్రవాహమై వర్షం మధురకావ్యమై విరిసె ఆకాశం భూమికి పంపిన లేఖలా మేఘం మనసుకు పలికిన మాటలా చినుకు చినుకుగా జారే కవితలా వర్షం ప్రకృతి ప్రేమగా కురిసె వర్షమా! నీవొస్తే వసుధ నవ్వుతుంది వనమంతా కొత్త చిగుర్లు తొడుగుతుంది మనసంతా మళ్లీ బాల్యమవుతుంది నీ జల్లులో జీవితం పులకిస్తుంది వర్షమా! దయచూపు — పొలాలు తడుపు పంటలు పండించు — పొట్టలు నింపు గొంతులు తడుపు — చల్లదనము ఇవ్వు అందాలు చూపు — ఆనందాలు అందిం...
Image
 రంగులు  మనసులను పరవశపరచుటకు చల్లేదా రంగులు  నేత్రాలను ఆకర్షించుటకు చూపేదా రంగులు    వాడిపోయిన జీవితాలకి మధుమాసాన్ని తెచ్చి  విరిసిన ఆశల పూదోటకు వేసేదా రంగులు  చీకటిలో చిక్కుకున్న ప్రాణులకు వెలుగై నిలిచి చిరునవ్వులు పెదవులపై పూయించేదా రంగులు కళాకారుని చేతికుంచెకు కదలికను అందించి  కాన్వాసుపై బొమ్మలకు అద్దించేదా రంగులు ప్రకృతమ్మ ఒడిలో పచ్చదనం కాపాడి పెంచి  అందాలు చూపించటానికి చిమ్మేదా రంగులు  మనుషులలోని మంచితనానికి కిరీటాన్ని పెట్టి  మానవత్వపు పతాకానికి పులిమేదా రంగులు  కన్నీటితో తడిసిన కన్నులకు ఓదార్పునిచ్చి కలతలను కడిగివేసేలా దిద్దేదా రంగులు పండుగలేని గడపలకు ఆనందం పంచిపెట్టి  ప్రతి ఇంటి ముంగిళ్లలో మెరిపించేదా రంగులు  రాజేంద్రుని కలమునుండి కారే అక్షరాలతో  రసహృదయుల గుండెలనందు నింపేదా రంగులు   గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 గిడుగు — తెలుగు వెలుగు గ్రాంథిక గోడలు కూల్చి వ్యావహారిక భాషను నడిపినవాడు గిడుగు ప్రజల నోట పలికే భాషే తెలుగు భాషకు ప్రాణమని చాటినవాడు గిడుగు పండితుల పుటలలో బంధించిన పలుకులను ప్రజల చెంతకు తెచ్చినవాడు గిడుగు సామాన్యుని మాటకు సాహిత్య గౌరవం సమకూర్చిన భాషా విప్లవ వీరుడు గిడుగు గిడుగు! నీ కలం కదిలితే తెలుగు తల్లి మురిసిపోయింది; నీ మాట మోగితే మూగబోయిన ప్రజల గొంతు పలికింది! గిడుగు! వ్యావహారికమే జీవభాష అని వాదించి కాదు—విప్లవించి చూపావు తెలుగు పలికే ప్రతి మనిషిలో తెలుగు తల్లిని దర్శింపజేశావు! గిడుగు! అక్షరజ్ఞానం లేనివాడికీ అర్థమయ్యే భాష కావాలన్నావు విద్య కొందరి సొత్తు కాదని విద్యకు ప్రజల బాట చూపావు! గిడుగు! శబ్దాల వెనుక దాగిన భాషను శ్వాసల మధ్యకు తెచ్చినవాడివి పుస్తకాల పుటల నుంచి తెలుగును ప్రజల పెదవులపై నిలిపినవాడివి! గిడుగు! నేడు మనం పలికే ప్రతి మాటలో నీ పోరాట ప్రతిధ్వని ఉంది నేటి తెలుగు స్వేచ్ఛా స్వరంలో నీ శ్రమకు సార్థకత ఉంది! గిడుగు! భాష బతికితే జాతి బతుకుతుంది— అని నీ జీవితం చెప్పింది; ప్రజల భాషే తెలుగు భాష— అని నీ ఉద్యమం చాటింది! గిడుగు! నీవు వెలిగించిన దీపం తరతరాలకు వెలుగునిస్తుంది తెల...
Image
 ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం మహాభాగ్యమని  అందరూ తెలుసుకొని చాటాలి ఆరోగ్యదీపం జీవితమంతా  వెలుగులు చిమ్మేలా చూడాలి  ధనరాశులెన్ని ఉన్నా ఆరోగ్యం లేకుంటే అంధకార కూపంలా జీవితం మిగులుతుంది ఆరోగ్యమనే సంపద తోడుగా ఉంటే ప్రతి అడుగూ ఆనందాల పండుగై సాగుతుంది పోషకాహారమే దేహానికి ప్రాణధారం కావాలి పండ్ల పరిమళాలతో, కూరల పచ్చదనంతో ఆరోగ్యపు వనాన్ని నిత్యం పెంచుకోవాలి శరీరమనే గుడిని పవిత్రంగా కాపాడుకోవాలి అతి తీపి, అతి ఉప్పు రుచులకు బానిస కాకుండా కొవ్వు పదార్థాల వలలో చిక్కుకోకుండా స్వచ్ఛమైన అమృతంలాంటి నీరు తాగుతూ ఆరోగ్యసిరులను ఒడిసిపట్టుకోవాలి ఉదయభానుడి కిరణాలతో మేల్కొని ఉత్సాహపు అడుగులతో వ్యాయామం చేయాలి నడకనే నేస్తంగా చేసుకొని నిత్యం సాగించి  నరనరాన కొత్త శక్తిని నింపుకోవాలి సమయానికి ఆహారం, సమయానికి నిద్ర జీవన గమనానికి క్రమశిక్షణ కావాలి స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యవీణకు మధురమైన స్వరాలు కావాలి పొగమంచులా కమ్ముకునే పొగతాగడాన్ని వీడి మత్తు మాయలో ముంచే మద్యానికి దూరంగా ఉండాలి  దేహాన్ని దహించే చెడు అలవాట్లన్నిటినీ  జీవితంలోకి చేరనీయకుండా జాగ్రత్త పడాలి మనసుపై పేరు...
Image
ఓ చంద్రముఖీ! తుంటరి చూపులతో కొరక్కుతినకే చంద్రముఖీ  కనుల సైగలతో రమ్మని పిలవకే చంద్రముఖీ  చెంతకుచేరి చేతులను కలిపి చతుర్లలో ముంచి   మాటలలో ముంచి మంటలురేపకే చంద్రముఖీ  తెల్లనిచీరనుకట్టి బంగారు నగలను ధరించి  అందాలు చూపి ఆటలాడించకే చంద్రముఖీ   పలురంగుల గాజులు వేసుకొని గలగలలాడించి  ఆనందం ఆశించి ఊరించకే చంద్రముఖీ  ఆకాశానికి తీసుకెళ్ళి ఉయ్యాల ఎక్కించి  ఊపులతో ఉక్కిరిబిక్కిరి చేయకే చంద్రముఖీ  సిగ్గులు చిందించి మెడపట్టి బుగ్గలను తడుముతూ  ముద్దులలో ముంచేసి మురిపించకే చంద్రముఖీ  ముచ్చటగా తయారై గజ్జెల చప్పుడులు చేస్తూ  విరహంలో పడవేసి వేదించకే చంద్రముఖీ  మరుమల్లెలు కొప్పులో తురుముకొని పున్నమిరోజున  వెన్నెలలో విహారముకు రమ్మనకే చంద్రముఖీ  ముసిముసినవ్వులు ఒలకబోస్తూ చిలిపి చేష్టలతో  వయ్యారాల వలపువలను విసరకే చంద్రముఖీ  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 
Image
 కళారత్న బిక్కి కృష్ణ ఎన్నో విజయాలు సాధించాడు మన బిక్కి కృష్ణ  ఎన్నో సభలు నిర్వహించాడు మన బిక్కి కృష్ణ   సభాసామ్రాటు, కళారత్నగా పేరు పొందాడు  ఎన్నో సన్మానాలు పొందాడు మన బిక్కి కృష్ణ  లయాత్మకంగా భావాత్మకంగా రంగరిస్తూ  ఎన్నో గొప్పకవితలు వ్రాశాడు మన బిక్కి కృష్ణ  ఎందరో యువకవులను తట్టి ప్రోత్సాహమిచ్చాడు  ఎన్నో సత్కారాలు చేశాడు మన బిక్కి కృష్ణ  తన జీవిత అనుభవాలను అక్షరాలలో పెట్టాడు  ఎన్నో పుస్తకాలు రచించాడు మన బిక్కి బిక్కి కృష్ణ  ఎందరో కవనప్రేమికుల సహకారం తీసుకొని  ఎన్నో సంస్థలను స్థాపించాడు మన బిక్కి కృష్ణ  సాహితీలోకాన దృవతారగా వెలుగుతున్నాడు  ఎన్నో హృదులు దోచుకున్నాడు మన బిక్కి కృష్ణ  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 కదలాలి పేజీల నింపుటకై కలాలు కదలాలి బొమ్మల అందాలకై కుంచెలు కదలాలి రాగాల మధురిమకై గళాలు ఎత్తాలి కవితల కూర్పుకై అక్షరాలు కదలాలి అర్థాల వెలుగులకై పదాలు మెరవాలి ఉల్లాస ఊపులకై ఊహలు కదలాలి కల్పనలు పూయుటకు భావాలు పుట్టాలి గమ్యాల చేరుటకై పాదాలు కదలాలి జలాశయాల నింపుటకు నదులు పారాలి కాలగమనముకు గడియారాలు కదలాలి చీకట్లు తరుముటకై దీపాలు వెలగాలి జగతి వెలుగుకై రవికిరణాలు కదలాలి ప్రేమలను పంచుటకై హృదయాలు మెదలాలి మానవతను నిలుపుటకై మనసులు కదలాలి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం