ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్యం మహాభాగ్యమని
అందరూ తెలుసుకొని చాటాలి
ఆరోగ్యదీపం జీవితమంతా
వెలుగులు చిమ్మేలా చూడాలి
ధనరాశులెన్ని ఉన్నా ఆరోగ్యం లేకుంటే
అంధకార కూపంలా జీవితం మిగులుతుంది
ఆరోగ్యమనే సంపద తోడుగా ఉంటే
ప్రతి అడుగూ ఆనందాల పండుగై సాగుతుంది
పోషకాహారమే దేహానికి ప్రాణధారం కావాలి
పండ్ల పరిమళాలతో, కూరల పచ్చదనంతో
ఆరోగ్యపు వనాన్ని నిత్యం పెంచుకోవాలి
శరీరమనే గుడిని పవిత్రంగా కాపాడుకోవాలి
అతి తీపి, అతి ఉప్పు రుచులకు బానిస కాకుండా
కొవ్వు పదార్థాల వలలో చిక్కుకోకుండా
స్వచ్ఛమైన అమృతంలాంటి నీరు తాగుతూ
ఆరోగ్యసిరులను ఒడిసిపట్టుకోవాలి
ఉదయభానుడి కిరణాలతో మేల్కొని
ఉత్సాహపు అడుగులతో వ్యాయామం చేయాలి
నడకనే నేస్తంగా చేసుకొని నిత్యం సాగించి
నరనరాన కొత్త శక్తిని నింపుకోవాలి
సమయానికి ఆహారం, సమయానికి నిద్ర
జీవన గమనానికి క్రమశిక్షణ కావాలి
స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన పరిసరాలు
ఆరోగ్యవీణకు మధురమైన స్వరాలు కావాలి
పొగమంచులా కమ్ముకునే పొగతాగడాన్ని వీడి
మత్తు మాయలో ముంచే మద్యానికి దూరంగా ఉండాలి
దేహాన్ని దహించే చెడు అలవాట్లన్నిటినీ
జీవితంలోకి చేరనీయకుండా జాగ్రత్త పడాలి
మనసుపై పేరుకునే ఒత్తిడి మేఘాలను
చిరునవ్వుల జల్లులతో చెదరగొట్టాలి
సానుకూల ఆలోచనల సుగంధం వెదజల్లుతూ
ప్రశాంతత పూలతో మనసును అలంకరించాలి
అనారోగ్యపు నీడలు దరిచేరకముందే
ఆరోగ్యసూత్రాల కవచం ధరించాలి
వ్యాధి వచ్చాక విలవిలలాడే కన్నా
ముందుగానే మేల్కొని మెలగాలి
వైద్యుల మాటలను వేదవాక్కులుగా భావించి
అవసరమైన పరీక్షలను సకాలంలో చేయించుకోవాలి
చిన్న సంకేతాన్నైనా నిర్లక్ష్యం చేయకుండా
ఆరోగ్యరథాన్ని సజావుగా నడిపించుకోవాలి
ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా నవ్వితే
ఇల్లంతా ఆనందాల హరివిల్లవుతుంది
ఆరోగ్యవంతులైన ప్రజలతో దేశం నిండితే
దేశబలమే దశదిశలా విరాజిల్లుతుంది
ధనం పోతే మళ్లీ సంపాదించగలం జీవితంలో
పోయిన ఆరోగ్యాన్ని తేలికగా కొనలేము
కోట్ల సంపద ఉన్నా ఆరోగ్యం లేకుంటే
ఆ సిరిసంపదలన్నీ ఎందుకూ పనికిరావు
అందుకే ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యమని
అందరి గుండెల్లో ఈ సత్యం నాటాలి
ఆరోగ్యం మహాభాగ్యమని నినదిస్తూ
ఆనంద ఆరోగ్య జీవితం గడపాలి!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment