గిడుగు — తెలుగు వెలుగు
గ్రాంథిక గోడలు కూల్చి
వ్యావహారిక భాషను నడిపినవాడు గిడుగు
ప్రజల నోట పలికే భాషే
తెలుగు భాషకు ప్రాణమని చాటినవాడు గిడుగు
పండితుల పుటలలో బంధించిన
పలుకులను ప్రజల చెంతకు తెచ్చినవాడు గిడుగు
సామాన్యుని మాటకు సాహిత్య గౌరవం
సమకూర్చిన భాషా విప్లవ వీరుడు గిడుగు
గిడుగు! నీ కలం కదిలితే
తెలుగు తల్లి మురిసిపోయింది;
నీ మాట మోగితే
మూగబోయిన ప్రజల గొంతు పలికింది!
గిడుగు! వ్యావహారికమే జీవభాష అని
వాదించి కాదు—విప్లవించి చూపావు
తెలుగు పలికే ప్రతి మనిషిలో
తెలుగు తల్లిని దర్శింపజేశావు!
గిడుగు! అక్షరజ్ఞానం లేనివాడికీ
అర్థమయ్యే భాష కావాలన్నావు
విద్య కొందరి సొత్తు కాదని
విద్యకు ప్రజల బాట చూపావు!
గిడుగు! శబ్దాల వెనుక దాగిన భాషను
శ్వాసల మధ్యకు తెచ్చినవాడివి
పుస్తకాల పుటల నుంచి తెలుగును
ప్రజల పెదవులపై నిలిపినవాడివి!
గిడుగు! నేడు మనం పలికే ప్రతి మాటలో
నీ పోరాట ప్రతిధ్వని ఉంది
నేటి తెలుగు స్వేచ్ఛా స్వరంలో
నీ శ్రమకు సార్థకత ఉంది!
గిడుగు! భాష బతికితే జాతి బతుకుతుంది—
అని నీ జీవితం చెప్పింది;
ప్రజల భాషే తెలుగు భాష—
అని నీ ఉద్యమం చాటింది!
గిడుగు! నీవు వెలిగించిన దీపం
తరతరాలకు వెలుగునిస్తుంది
తెలుగు భాష ఉన్నంతకాలం
నీ పేరు చిరంజీవిగా నిలుస్తుంది!
గిడుగు! వ్యావహారిక భాషకు నీవే ఊపిరి,
తెలుగు జాతికి నీవే స్ఫూర్తి;
గిడుగు పేరు పలికిన ప్రతిసారీ
గర్విస్తుంది తెలుగు తల్లి!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment