పిచ్చెక్కినపుడు

ఆలోచనల పిచ్చెక్కినపుడు —
ఆకాశమంతా ఊహలై,
అంతరంగమంతా అలలై,
అంశాల వేటలో మనసు పరుగెడుతుంది!

భావాల పిచ్చెక్కినపుడు —
మౌనమే మాటలవుతుంది,
మనసే మధురగీతమవుతుంది,
మమతల జల్లు కురుస్తుంది!

అక్షరాల పిచ్చెక్కినపుడు —
ఆదిప్రాస అమరుతుంది,
అంత్యలయ కుదురుతుంది,
అందమైన పదచిత్రం పుడుతుంది!

పదాల పిచ్చెక్కినపుడు —
ప్రాసలు పరుగులు తీస్తాయి,
భావాలు రెక్కలు తొడుగుతాయి,
లయలు లాస్యాలు చేస్తాయి!

కలం పిచ్చెక్కినపుడు —
కాగితం కదనరంగమవుతుంది,
కల కవితవుతుంది,
కన్నీరు కావ్యమవుతుంది!

రాయాలని పిచ్చెక్కినపుడు —
నిదురైనా దూరమవుతుంది,
నిశిరాత్రి సైతం మేల్కొంటుంది,
నాలోని కవిత జ్వలిస్తుంది!

కవితల పిచ్చెక్కినపుడు —
పువ్వులన్నీ కవనాలవుతాయి,
పక్షులన్నీ పాటలవుతాయి,
ప్రకృతంతా కవితగా మారుతుంది!

కవిత పిచ్చెక్కినపుడు —
నేను నేనుగా ఉండను,
నా లోకం నాదిగా ఉండదు,
అక్షర లోకంలోనే విహరిస్తాను!

ఈ పిచ్చి — వ్యాధి కాదు,
ఈ పిచ్చి — బాధ కాదు,
ఈ పిచ్చే నా ఊపిరి,
ఈ పిచ్చే నా కవిత్వం!

కలం కదిలినంతకాలం —
కవిత పుడుతూనే ఉంటుంది;
హృదయం కొట్టుకున్నంతకాలం —
ఈ కవితా పిచ్చి బ్రతికే ఉంటుంది!

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog