Posts

Showing posts from October, 2026
Image
 అక్షరాల ఆటలు అక్షరరూపాలు అందంగా దిద్దుతా, ఆనందంగా పంచుతా. అక్షరజల్లులు చిటపటా కురిపిస్తా, తనువులు తడిపేస్తా. అక్షరకుసుమాలు మాలలుగా అల్లుతా, మెడల్లో అలంకరిస్తా. అక్షరసౌరభాలు అన్నిదిక్కులా చల్లుతా, అందరినీ ఆఘ్రాణింపజేస్తా. అక్షరసుధలు అందరిపై వెదజల్లుతా, గుటగుటా ఆస్వాదింపజేస్తా. అక్షరజ్యోతులు ధగధగా వెలిగిస్తా, కళాకాంతులు చిమ్మిస్తా. అక్షరతూటాలు పెన్నులతో పేలుస్తా, వెన్నుల్లో దూర్పిస్తా. అక్షరవిన్యాసాలు అద్భుతంగా చేసిచూపుతా, అందరినీ ఆకట్టుకుంటా. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Image
 నా అక్షరవాసం ఎంత ఎత్తుకు ఎగిరినా చివరకు — అక్షరాల మీదనే వాలుతా, ఎన్ని ఆకాశపు అందాలు చూసినా — అక్షరాల వెలుగులనే వెతుకుతా! ఎన్ని లోకాలు వీక్షించినా — అక్షరాల అద్దంలో చూస్తా, ఎన్ని ఆనందాలు పొందినా — అక్షరాల అమృతం ఆస్వాదిస్తా! ఎన్ని ఆలోచనలు తట్టినా — అక్షరాల రూపం ఇస్తా, ఎన్ని భావాలు పుట్టినా — అక్షరాల ఒడిలో పెడతా! ఎన్ని కలలు కంటినా — కలానికి ఊపిరి పోస్తా, ఎన్ని అనుభూతులు పొంగినా — పదాల పూలను పూయిస్తా! ఎంతమంది స్నేహితులున్నా — అక్షరాలతోనే ముచ్చటిస్తా, మౌనంలో కూడా నాతో ఉండే — అక్షర బంధాన్ని ప్రేమిస్తా! కాలం మారినా, లోకం మారినా — అక్షరాల తోడు వీడను, చివరి శ్వాస వరకు కూడా — అక్షర దీపం ఆరనివ్వను! అక్షరాలే నా ఆలోచనామృతం, అక్షరాలే నా ఆనందసాగరం; అక్షరాలే నా అలరులవనం, అక్షరాలే నా సాహిత్యసౌరభం! గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.