ఆనందసాగరం


ఆనందంలో తేలేవారికి —

అలలే అమృతమవుతాయి,

ఆశలన్నీ రెక్కలవుతాయి,

అంతరంగాలు ఆకాశమవుతాయి!


ఆనందంలో మునిగేవారికి —

ముత్యాలే ముచ్చటలవుతాయి,

మమతలే మధురిమలవుతాయి,

మనసంతా మల్లెలవుతుంది!


ఆనందంలో కాలం గడిపేవారికి —

క్షణాలే కవితలవుతాయి,

కాలమే కలలవుతుంది,

జీవితమే జాబిలవుతుంది!


ఆనందంలో మైమరచేవారికి —

లోకమే లాలిపాటవుతుంది,

ప్రకృతే ప్రేమగీతమవుతుంది,

ప్రతి శ్వాసా ఉత్సవమవుతుంది!


ఆనందంలో తడిసేవారికి —

కన్నీళ్లే కాంతులవుతాయి,

కష్టాలే కథలవుతాయి,

గాయాలే గేయాలవుతాయి!


ఆనందాన్ని పంచేవారికి —

పెదవులే పూలవనమవుతాయి,

పలుకులే పరిమళాలవుతాయి,

పరిచయాలే పున్నములవుతాయి!


ఆనందంలోనికి ఆహ్వానించేవారికి —

అడుగడుగునా ఆత్మీయత లభిస్తుంది,


మనసునిండా మాధుర్యం చేకూరుతుంది,

జీవితమంతా సౌహార్దం నిండుతుంది!


ఆనందసాగరంలో ఒక్కసారి —

అడుగుపెడితే చాలు,

దుఃఖపు దారులన్నీ దూరమై,

సంతోషపు తీరాలే కనిపిస్తాయి!


ఆనందం వెతికే చోట కాదు —

మనసులో మొలిపించే పువ్వు,

పంచినకొద్దీ పరిమళించే భావం,

జీవించినకొద్దీ విరిసే సౌరభం!


రండి... రండి...

ఆనందసాగరంలో తేలుదాం,

అనురాగపు అలల్లో ఊగుదాం,

అందరి హృదయాల్లో ఆనందదీపాలు వెలిగిద్దాం!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog