ఎందుకో?
కొన్నిసార్లు పకపకా నవ్వాలనిపిస్తుంది —
నవ్వుల పూలు విరబూయాలని,
నలుదిక్కులా ఆనందం చిందేలా
నా మనసే వసంతం కావాలని!
కొన్నిసార్లు గగనాన విహరించాలనిపిస్తుంది —
ఆకాశపు అంచుల్ని తాకాలని,
గాలిపటమై గాలితో పోటీపడుతూ
కలల లోకంలో విహరించాలని!
కొన్నిసార్లు ఎదురుతిరగాలనిపిస్తుంది —
ఎదలోని ఆవేశం ఎగసిపడాలని,
అన్యాయపు గోడలను కూలదోస్తూ
ఆత్మగౌరవపు జెండా ఎగరేయాలని!
కొన్నిసార్లు తలవంచాలనిపిస్తుంది —
తప్పులను తలచుకొని తల్లడిల్లుతూ,
అహంకారాన్ని అణచి వినయంతో
ఆత్మపరిశీలన చేసుకోవాలని!
కొన్నిసార్లు పారిపోవాలనిపిస్తుంది —
బాధల బంధాలు వెంటాడుతుంటే,
బరువెక్కిన బ్రతుకు బాటల నుంచి
దూరతీరాలకు చేరుకోవాలని!
కొన్నిసార్లు మాటలాడాలనిపిస్తుంది —
మనసులోని మధురిమలన్నీ పంచాలని,
మౌనంగా మిగిలిన మమతలన్నీ
మాటల ముత్యాలుగా మార్చాలని!
కొన్నిసార్లు మౌనం వహించాలనిపిస్తుంది —
మాటల మంటలు మనసును దహిస్తుంటే,
వాదనల వలయాల నుంచి విడివడి
ప్రశాంత తీరాన నిలవాలని!
కొన్నిసార్లు రాయాలనిపిస్తుంది —
రాయని భావాల రెక్కలు విప్పాలని,
కన్నీటి చుక్కల్ని కవితలుగా మార్చి
కాగితంపై హృదయాన్ని పరచాలని!
కొన్నిసార్లు ఏడ్వాలనిపిస్తుంది —
ఎదలోని వేదనంతా కరిగిపోవాలని,
కన్నీటి ధారలో కలతలన్నీ కొట్టుకుపోయి
కలతలేని మనసు మిగలాలని!
కొన్నిసార్లు ఇలా... కొన్నిసార్లు అలా...
ఇదే కదా మనసు చేసే గారడీ!
మనసన్నది మాయల మలుపుల బాట,
మార్పులే దాని నిత్య జీవితపాట!
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment