చెట్లు
చెట్లకు కొమ్మలు పుడితే —
చేతులెత్తి పిలిచినట్టే!
చెట్లకు చిగుర్లు తొడిగితే —
చిగురాశలు చిగురించినట్టే!
చెట్లకు పువ్వులు పూస్తే —
ప్రకృతే నవ్వుల పూలు చల్లినట్టే!
చెట్లకు కాయలు కాస్తే —
భూమాత ఒడిలో సంపద పండినట్టే!
చెట్లకు గాలి తగిలితే —
సరిగమల సవ్వడి వినిపించినట్టే!
చెట్ల కొమ్మలు ఊగితే —
ఆనందంతో నాట్యమాడినట్టే!
చెట్ల ఆకులు గలగలలాడితే —
అమృతగీతాలు ఆలపించినట్టే!
చెట్ల నీడన సేదదీరితే —
అమ్మ ఒడిలో ఒదిగినట్టే!
చెట్లకు డబ్బులు పండితే —
ధనవంతులమైనట్టే!
చెట్లకు నోట్లే కాస్తే —
గల్లాపెట్టెలు నోట్లతో నిండినట్టే!
పేదరికమే పలాయనమైతే —
ప్రతి గడపా పండుగైనట్టే!
కష్టాలన్నీ కరిగిపోతే —
కలల రాజ్యం కళ్లముందున్నట్టే!
కానీ... ఒక్క క్షణం ఆలోచించు —
కాసుల చెట్లే నిజమైతే,
కష్టపడే చేతులు ఏమవుతాయి?
శ్రమను నమ్మే గుండెల మాటేమవుతుంది?
ధనమే దైవమై నిలిచిపోతే,
మానవత్వపు విలువేమవుతుంది?
చెట్లు డబ్బులివ్వకపోయినా —
చల్లని నీడను పంచుతాయి!
చేతినిండా కాసులివ్వకపోయినా —
చెట్లు కడుపునిండా ఫలాలనిస్తాయి!
ఊపిరి పోసే ప్రాణవాయువునిచ్చి —
ఉన్నతమైన జీవనాన్నిస్తాయి!
ప్రతిఫలమాశించని త్యాగంతో —
ప్రకృతి ప్రేమను చాటుతాయి!
చెట్లకు డబ్బులు పండకపోవచ్చు —
చెట్లతోనే బతుకులు పండవచ్చు!
చెట్లకు నోట్లు కాయకపోవచ్చు —
చెట్లతోనే ధనాన్ని ఆర్జించవచ్చు!
చెట్లను పెంచితే ప్రకృతి నవ్వుతుంది —
చెట్లను నరికితే భవిత వణుకుతుంది!
చెట్ల విలువను గుర్తిద్దాం —
వాటి గొప్పదనాన్ని తెలుసుకుందాం!
చెట్లను కాపాడటమే మన ధర్మం —
పచ్చని భూమిని అందించటమే మన కర్తవ్యం!
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment