అక్షరగారడి


కలాలు

హలాలయ్యయి

చేబడతా

సాహిత్యసేద్యం చేస్తా


అక్షరాలు

దీపాలయ్యాయి

వెలిగిస్తా

సక్రమమార్గాలు చూపిస్తా


పదాలు

పువ్వులయ్యాయి

పరికింపజేస్తా

పొంకాలు ప్రదర్శిస్తా


సాహిత్యం 

సౌరభమయమయ్యింది

చల్లుతా

సర్వులను సంతసపరుస్తా


కాగితాలు

తేనెతుట్టలయ్యాయి

పిండుతా

పలువురికి పంచుతా


గళము

మధురమయ్యింది

ఆలపిస్తా

శ్రోతలను అలరిస్తా


పలుకులు

లేతకొబ్బరిపలుకులయ్యాయి

పంచుతా

పరవశపరుస్తా


అధరాలు

అమృతపాత్రలయ్యాయి

అందిస్తా

ఆనందపరుస్తా


చూపులు

వలలయ్యాయి

విసురుతా

సమ్మోహనపరుస్తా


కలలు

కల్పనలయ్యాయి

చదివిస్తా

నిజమని నమ్మిస్తా


కవితలు

కలగూరగంపలయ్యాయి

వండుతా

విస్తరాకులలో వడ్డిస్తా


సాహిత్యం

వనమయ్యింది

కొండాకోనలకనబరుస్తా

సెలయేర్లను పారిస్తా


కవిత్వం

కడలయ్యింది

కుతూహలపరుస్తా

కెరటాలను కనమంటా 


కవులు

ఇంద్రజాలికులయ్యారు

మంత్రిస్తా

మనసులను మాయజేస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం





Comments

Popular posts from this blog