ఓ మనసా!
చీకట్లో ఉండేవు
తలపుల్లో ముంచేవు
మరుగుల మాటునీవు
తపనల చోటునీవు ||చీకటిలో||
కనపడక దాగేవు
ఉనికిని చాటేవు
ఆఙ్ఞలు ఇచ్చేవు
అమలును పరిచేవు
పనులను చేయించేవు
చైతన్యమును చూపెంచేవు
ప్రాణమును నిలబెట్టేవు
జీవనమును గడిపించేవు ||చీకటిలో||
ఉన్నవి వదిలేసేవు
లేనివి కోరుకొనేవు
చేసేది చెప్పకుండేవు
చెప్పింది చేయకుండేవు
సుఖమును ఆశించేవు
సూక్తులను వల్లెవేసేవు
మంచితనము చూపించేవు
మాలిన్యము దాచిపెట్టేవు ||చీకటిలో||
కంటితో వీక్షించేవు
కన్నవాటిని కాంక్షించేవు
కర్ణాలతో ఆలకించేవు
శ్రావ్యతని క్రోలుకునేవు
శ్వాసను తీసుకునేవు
సుగంధాలను కోరేవు
నోటితో ఆరగించేవు
రుచులను ఆశించేవు ||చీకటిలో||
మోవులను బిగించేవు
మాట్లాడక మెలిగేవు
మర్మాలను దాచేవు
మౌనమును దాల్చేవు
దేహపెత్తనము సాగించేవు
అధికారము చలాయించేవు
గొప్పలను పలువురికిచెప్పేవు
మెప్పులను వినగనిష్టపడేవు ||చీకటిలో||
అందాలను చూడగోరేవు
ఆనందాలను ఆస్వాదించేవు
ప్రేమాభిమానాలు పొందేవుపంచేవు
బాంధవ్యాలను పెంచుకొనేవుకొనసాగించేవు
చైతన్యమును చూపించేవు
విఙ్ఞానమును అందించేవు
నిండుజీవితము గడపాలనుకునేవు
నూరేళ్ళబ్రతుకు కోరేవునీవు ||చీకట్లో||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment