ఓ వెన్నెలా!


వెన్నెల వెన్నెల వెన్నెలా

పున్నమి రాతిరి వెన్నెలా

చక్కని చల్లని వెన్నెలా

తెల్లని జాబిలి వెన్నెలా                     ||వెన్నెల||


ఏ భామ వన్నెవే వెన్నెలా

మదిని తడుతున్నావే వెన్నెలా 

ఏ లేమ నవ్వువే వెన్నెలా

రమ్మని పిలుస్తున్నావే వెన్నెలా                ||వెన్నెల||


ఏ వనిత సిగమల్లెవే వెన్నెలా

తెల్లగా కనిపిస్తున్నావే వెన్నెలా

ఏ ముదిత మోమువే వెన్నెలా

మెరుపులా మెరుస్తున్నావే వెన్నెలా             ||వెన్నెల||


ఏ పడతి పులకరింతవే వెన్నెలా

ఇంపుసొంపులు ఒలుకుతున్నావే వెన్నెలా

ఏ సుదతి ఎదమంటవే వెన్నెలా

నిప్పును ఆర్పమంటున్నావే వెన్నెలా            ||వెన్నెల||


ఏ మెలత మురిపానివే వెన్నెలా

పకపకలాడుతున్నావే వెన్నెలా

ఏ నెలత పైపూతవే వెన్నెలా

ధగధగలాడుతున్నవే వెన్నెలా                 ||వెన్నెల||


ఏ అంగన చూపువే వెన్నెలా

వయ్యారాలతో వెలుగుతున్నావే వెన్నెలా

ఏ అతివ ప్రతీకవే వెన్నెలా

కళ్ళనుకట్టేస్తున్నావే వెన్నెలా                  ||వెన్నెల||


చేతులు చాస్తున్నావే వెన్నెలా

బయటకు రమ్మంటున్నావే వెన్నెలా

విహారంచేద్దామంటున్నావే చిరునవ్వులతో వెన్నెలా

ముచ్చట్లుచెప్పుకుందామంటున్నావే మెల్లగా వెన్నెలా  ||వెన్నెల||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog