నవ్వుల బాటలో నడుద్దాం — నూరేళ్ల జీవితం బ్రతుకుదాం
బాగా బ్రతుకుదాం —
బంగారు భావాలతో మనసును నింపుదాం,
మనుగడకు మాధుర్యమై
మనసుల మధ్య మమకారం చల్లుదాం.
నిలకడగా బ్రతుకుదాం —
నీతిమార్గాన్ని నడకగా చేసుకుందాం,
అడుగడుగునా ధైర్యంగా
అర్థవంతమైన అడుగులు వేద్దాం.
నిశ్చింతగా బ్రతుకుదాం —
నేటి క్షణాలను నిధిగా భావించుదాం,
గతపు గాయాలను గాలిలో కలిపి
రేపటిని చిరునవ్వులతో ఆహ్వానిద్దాం.
నిర్భయంగా బ్రతుకుదాం —
నిజం అనే కవచం ధరించుదాం,
న్యాయం అనే దీపంతో
అంధకారాల్ని పారదోలుదాం.
నిజాయితీగా బ్రతుకుదాం —
మనసుకు మనమే సాక్షులమవుదాం,
మాటల్లో మాధుర్యాన్ని
చర్యల్లో చైతన్యాన్ని నింపుకుందాం.
నిగర్విగా బ్రతుకుదాం —
విజయాల్ని వినయంగా ధరించుదాం,
మనిషితనమును ముద్దాడుతూ
మానవత్వమునకు మకుటమై నిలుద్దాం.
నిర్మొహమాటంగా బ్రతుకుదాం —
నిజం చెప్పే నిబ్బరంతో మెలుగుదాం,
న్యాయానికి నిత్య దీపమై
జీవిత గృహంలో వెలిగించుదాం.
నవ్వుతూ బ్రతుకుదాం —
చిరునవ్వుల చినుకులతో గడుపుదాం,
చుట్టూ ఉన్న చీకట్లను చెదరగొట్టి
ఆనందాన్ని అక్షరాలా పంచుదాం.
నిండునూరేళ్లు బ్రతుకుదాం —
నిరంతర ప్రేమల పూలను చల్లుదాం,
సార్థక జీవన గీతాన్ని ఆలపిస్తూ
సుగంధ జ్ఞాపకాలై మిగిలిపోదాం.
బ్రతకటం అంటే
కాలం గడపటం కాదు —
మనసులు తాకే
ముద్దైన మానవత్వం చాటటం.
నవ్వు పెట్టుబడి పెడితే —
ఆనందం వడ్డీగా వస్తుంది;
మనసు మమకారం పంచితే —
మానవత్వం లాభంగా మిగులుతుంది.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment