ఆనంద తరంగాల్లో...
ఆనందాల్లో మునుగుతా —
అమృతపు అలలలో ఆత్మను ముంచుతా,
మనసు సరస్సులో మెరిసే
మధుర కాంతులను మిలమిలలాడిస్తా.
ఆనందాల్లో తేలుతా —
ఆశల హంసలా ఆకాశంలో విహరిస్తా,
సంతోష సవ్వడుల్లో
సరిగమల సప్తస్వరాల్లా పరవశించుతా.
ఆనందాల్లో కాలం గడుపుతా —
ప్రతి క్షణాన్నీ పూల దండగా అల్లుతా,
నవ్వుల నిండిన నిమిషాలతో
గంటల తరబడి జాజివాన కురిపించుతా.
ఆనందాల్లో పయనిస్తా —
అనురాగ మార్గాల్లో అడుగులు వేస్తా,
సహృదయాల సాన్నిధ్యంలో
సుగంధ గాలిలా సతతం సంచరిస్తా.
ఆనందాల్లో జీవిస్తా —
మనసుల మధురతను మమతగా పంచుతా,
సంతోషాల సూర్యకిరణాలతో
జీవిత గగనాన్ని
సంపూర్ణంగా ప్రకాశింపజేస్తా.
ఆనందాల్లో నవ్వుతా —
ఆత్మ గానంగా ఆనందం ఆలపిస్తా,
ప్రేమ పూవుల పరిమళంతో
ప్రపంచాన్నంతా పరవశింపజేస్తా.
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment