తెరిచిన వేళలు…
తలుపు తెరిస్తే —
లోకమే లోపలికి వస్తుంది,
ఆహ్వానం పలికితే
అవకాశం అడుగుపెడుతుంది.
కిటికీ తెరిస్తే —
గాలి గుసగుసలు చెబుతుంది,
వెలుగు చిరునవ్వుతో
చీకటిని వెనక్కు నెట్టుతుంది.
నోరు తెరిస్తే —
నిజం నడిచివస్తుంది,
మాట మధురమైతే
మౌనం కూడా అర్థమవుతుంది.
కళ్ళు తెరిస్తే —
దృశ్యమే కాదు, దృష్టి కనిపిస్తుంది,
చూపులో చైతన్యం ఉంటే
జీవితం దారి చూపుతుంది.
గుప్పెట తెరిస్తే —
దానం ధర్మమవుతుంది,
పిడికిలి సడలితే
పుణ్యం పండుతుంది.
డబ్బు సంచి తెరిస్తే —
అవసరం ఊపిరి పీలుస్తుంది,
లెక్కతో కాదు — లక్ష్యంతో
ఖర్చుకూ అర్థం దొరుకుతుంది.
పుస్తకం తెరిస్తే —
కాలమే వెనక్కు నడుస్తుంది,
అక్షరాలు అగ్నికణాలై
ఆలోచనలను వెలిగిస్తాయి.
మనసు తెరిస్తే —
మనిషే పుట్టుకొస్తాడు,
అహంకారం కరుగుతుంది,
ఆనందం అడుగుపెడుతుంది.
అన్నీ తెరవాలంటే —
సమయం కాదు, సంకల్పమే కావాలి;
తెరిచిన వేళల్లోనే
జీవితం నిజంగా మొదలవుతుంది.
అన్ని తెరిచినా —
మనసు మూసితే శూ
న్యమే;
అన్నీ మూసినా —
మనసు తెరిస్తే సంపూర్ణమే.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment