అక్షరాల ఉరుములు
అద్భుత కవిసమ్మేళనంలో…
నిర్వాహకుల ఆధ్వర్యంలో…
అతిథుల సమక్షంలో…
కవులు ఊపేశారు —
భావాల గాలివానల్ని రేపుతూ,
అక్షరాల అలలతో గుండెల్ని గుబాళింపజేశారు.
కవులు ఉరిమారు —
ఉరుముల్లాంటి పదాలతో పులకరింతలు పుట్టిస్తూ,
నిశ్శబ్దాన్నే నినాదంగా మలిచారు.
కవులు ఊదేశారు —
మాటల్లో మధురిమల్ని ముద్దాడిస్తూ,
మనసుల తలుపులు మెల్లగా తెరచారు.
కవులు ఉప్పొంగారు —
ఆవేశపు అగ్నిజ్వాలలై ఎగసిపడుతూ,
సత్యాల్ని సమాజం ముందుంచారు.
కవులు ఊపారు —
లయల లహరిలో లోకాన్ని ఊయలూగిస్తూ,
ప్రాసల పల్లకిలో పరవశం పంచారు.
కవులు ఉతికారు —
అసత్యాల మలినాలను పదాలతో శుభ్రపరుస్తూ,
సత్యస్వరూపాన్ని ప్రతిబింబింపజేశారు.
కవులు ఉరికారు —
ఆలోచనల అంచులపై ఆత్మల్ని పరుగెత్తిస్తూ,
అక్షరాల ఆకాశంలో విహరింపజేశారు.
కవులు ఉత్సాహపరిచారు —
నిరాశల నీడలను తొలగిస్తూ,
ఆశల దీపాల్ని ప్రతి గుండెలో వెలిగించారు.
అలా… కవిసమ్మేళనం కేవలం సభ కాదు —
అక్షరాల ఆరాటం, భావాల ఉరుము,
అంతరంగాల మేల్కొలుపు, సమాజపు స్పూర్తి!
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment