నాకెందుకో…
నాకెందుకో…
మంచిగా మెలగాలని ఉన్నది —
మాటల్లో మమతా మాధుర్యం కలిపి
మనసుల్ని మల్లెల పరిమళంగా మార్చాలని ఉన్నది.
నాకెందుకో…
తలలను తట్టాలని ఉన్నది —
తల్లిలా తడిమి తీరుతూ
తప్పొప్పులు తెలియజేసి త్రోవ చూపాలని ఉన్నది.
నాకెందుకో…
గుండెలు గుబాళింపజేయాలని ఉన్నది —
శ్రావ్యమైన సప్తస్వరాలతో
భావాల గీతాలు గుండెల్లో కుమ్మరింపజేయాలని ఉన్నది.
నాకెందుకో…
హృదయాలను హత్తుకోవాలని ఉన్నది —
హత్తుకున్న క్షణాల్లోనే
హరివిల్లు రంగులు నింపాలని ఉన్నది.
నాకెందుకో…
మదులను ముట్టాలని ఉన్నది —
మురిసే మనసుల మడతల్లో
మమతల దీపాలు వెలిగించాలని ఉన్నది.
నాకెందుకో…
చెంతకు చేరాలని ఉన్నది —
సమీపమైన హృదయాల్లో
చిరునవ్వుల చినుకులు చల్లే చల్లని మేఘమవాలని ఉన్నది.
నాకెందుకో…
మనుషుల మధ్య తిరగాలని ఉన్నది —
మాటల్లో మాధుర్యం, మమకారం మేళవించి”
మానవత్వం మళ్లీ మేల్కొల్పాలని ఉన్నది.
నాకెందుకో…
సమాజానికి సేవ చేయాలని ఉన్నది —
సాయంలోనే సత్యం చూసి
సంతృప్తి సౌఖ్యాల్ని పంచాలని ఉన్నది.
నాకెందుకో…
సూక్తులు చెప్పాలని ఉన్నది —
సుభాషితాల సిరులతో
సూక్ష్మ సత్యాలు సజీవం చేయాలని ఉన్నది.
నాకెందుకో…
భళిగా బోధించాలని ఉన్నది —
బోధనలో బంగారు బాటలు చూపించి
బతుకు బాటలో వెలుగులు నింపాలని ఉన్నది.
నాకెందుకో… ఇది అంతా ఎందుకో తెలియదు గానీ —
మనసు మాత్రం మెల్లగా చెబుతోంది…
మనిషిగా పుట్టిన పుణ్యానికి — “మానవత్వం పూయించి —
మనసుల మధ్య నిత్యం పరిమళమవమని“!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment