రామాయణ కల్పవృక్షం
చదువుదాం చదువుదాం
రామాయణం కనులారా చదువుదాం,
విందాం విందాం
శ్రీరాముని కథలు చెవులారా విందాం.
వెళ్దాం వెళ్దాం
రామాలయానికి వెళ్దాం,
చూద్దాం చూద్దాం
సీతారాముల కళ్యాణం చూద్దాం.
గౌరవిద్దాం గౌరవిద్దాం
రామునిలా తండ్రులను గౌరవిద్దాం,
తీర్చుదాం తీర్చుదాం
దశరథపుత్రునిలా తల్లుల కోర్కెలు తీర్చుదాం.
చాటుదాం చాటుదాం
జానకీ రాముల్లాగా ఆదర్శ దాంపత్యం చాటుదాం,
సాగుదాం సాగుదాం
రామలక్ష్మణుల్లాగా అన్నదమ్ముల అనుబంధం సాగుదాం.
చేద్దాం చేద్దాం
కౌసల్యాసుతునిలా సుగ్రీవునితో స్నేహం,
చూపుదాం చూపుదాం
హనుమంతునిలా స్వామి సేవా మార్గం.
వినవద్దందాం వినవద్దందాం
మంధర బోధలను వినవద్దందాం,
చెయ్యొద్దందాం చెయ్యొద్దందాం
మారీచునిలా దుష్టకార్యాలు చెయ్యొద్దందాం.
కొనియాడుదాం కొనియాడుదాం
రామరాజ్య పాలనను కొనియాడుదాం,
పాటించమందాం పాటించమందాం
పాలకులను రామపాలనను పాటించమందాం.
తెలుపుదాం తెలుపుదాం
రామునికి ఒక్కటే బాణమని తెలుపుదాం,
చెబుదాం చెబుదాం
రామునికి ఒక్కటే భార్య అని చెబుదాం.
అంతరిద్దాం అంతరిద్దాం
శ్రీరామునిలా రావణాసురులను అంతరిద్దాం,
కాపాడుదాం కాపాడుదాం
విభీషణులాంటి హితోభిలాషులను కాపాడుదాం.
కందాం కందాం
లవకుశుల్లాంటి సంతానం కందాం,
అప్పగిద్దాం అప్పగిద్దాం
రామాయణ విలువల వారసత్వం తరాలకు అప్పగిద్దాం.
✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment