పయన ప్రపంచం


పయనించే లోకమా —

పరుగులు తీసే కాలచక్రమా.

నిన్నటి జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ

రేపటి కలల వైపు పరుగెడుతున్నావా?


పయనించే కాలమా —

క్షణాల కిరణాల గమనమా,

వేస్తున్న అడుగులలోనే

జీవిత గాథలన్నీ దాచిపెడుతున్నావా?


పయనించే మేఘమా —

ఆకాశపు ఆలోచనల సందేశమా,

ఎడారి హృదయాలపై వర్షమై కురిసి

ఆశల మొగ్గలు మేల్కొలుపుతున్నావా?


పయనించే చందమా —

నిశీథపు నిశ్శబ్ద సాక్షివా,

నిదురలోనూ మనసుల వెంట నడిచి

కలలపై కాంతిని చల్లుతున్నావా?


పయనించే చిలుకా —

పచ్చని ప్రకృతికి పలుకుల దూతవా! 

పలుకుల్లో ప్రేమను నింపి

పాటల్లో పరవశం పంచుతున్నావా?


పయనించే బాటసారి —

బాధల బండలను మోసే జీవుడా,

దారిలో దొరికే అనుభవాలనే

దీపాలుగా వెలిగించుతున్నావా?


పయనమనే పదం — 

జీవితానికే జవాబైతే,

గమ్యమనే భావం — 

మనసుకే మధురమైన మాయే.


ప్రతి అడుగూ పాఠమై, ప్రతి క్షణం కవితై,

ప్రతి ఊపిరి ఊసై, జీవితం జారిపోతుంటే…

మనసు ముందుకు సాగుతుంటే—

ఈ లోకం ఒక ప్రయాణమే, మనమందరం ప్రయాణికులమే!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments

Popular posts from this blog