కలంతో ప్రభంజనం


కలమే నా ఆయుధం —

పేనా చేతబట్టి

భావాల సముద్రాన్ని

ఉప్పొంగింపజేస్తా.


పదాలు అల్లుతా —

మనసుల నూలుతో

అర్థాల వస్త్రాన్ని

సూక్ష్మంగా నేస్తా.


పంక్తులు కూర్చుతా —

స్వరాల తాకిడిలో

సౌందర్యపు

సింహాసనం నిర్మిస్తా.


పుటలు నింపుతా —

ప్రాణం పోసిన

ఆలోచనలతో

హృదయాల్లో వెలుగులు నింపుతా.


మౌనంలో దాగిన

స్వరాలకు

సామాజిక వేదికనిచ్చి

సత్యాన్ని గర్జనగా నిలుపుతా.


అలసిన ఆశలకు

ఆధారమవుతూ

నిరుత్సాహ నిశిలో

నూతన నక్షత్రం నాటుతా.


రసధార ప్రవాహంలో

మనసులను ముంచెత్తి

అక్షరాల అమృతంతో

జీవితార్థం తెలుపుతా.


ఇదే నా ప్రయాణం —

కలంతో ప్రభంజనం,

కవిత్వంతో క్రాంతి,

భావంతో భవిష్యత్తు!


— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.




Comments