అక్షరాల ఆటలు


ఆడుదమా అచ్చరాలతో ఆట —

అక్షరాల అల్లికతో అంతరంగాలను అలరిస్తూ,

పుష్పాల దండల్లో పొంకాలు ప్రదర్శిస్తూ,

పదాల పందిళ్ళల్లో పరిమళాల్ని చల్లుతూ.


పాడుదమా ప్రాసల పాట —

ఛందస్సు చెలిమిలో చిలకల గీతాలవుతూ,

లయల లహరిలో మనసులను ముంచుతూ,

మధుర స్వరాలతో మధువును పంచుతూ.


పారించెదమా ఆలోచనల వరద —

ఎండిన వాగులను గలగలలాడిస్తూ,

సత్యాల సాగరంలో సత్యాన్ని చిమ్ముతూ,

సృజనల సిరులను సిరిసంపదలుగా చిందిస్తూ.


కట్టెదమా భావాల మూట —

హృదయపు హారాల్లో హారతుల్లా వెలుగుతూ,

ప్రేమ పూతలతో పుష్పగుచ్ఛాల్లా పేరుస్తూ,

మనసుల మధ్య మమతా మంత్రాలై నిలుస్తూ.


చేసెదమా అందాల వర్ణన —

ప్రకృతి పుటలపై పరిమళాల చిత్రాలవుతూ,

మనోహర క్షణాలను మణిమాలలుగా మలుస్తూ,

అందాన్ని ఆరాధనగా ఆవిష్కరించుతూ.


పంచెదమా ఆనందాల పంట —

సంతోషపు సాగులో సిరులు పండిస్తూ,

నవ్వుల నిండుగ నిత్య వసంతంలా విరబూస్తూ,

ప్రతి హృదయంలో పుష్పోత్సవం నింపుతూ.


పంపెదమా సమాజ మాధ్యమాలకు —

మన భావాల బాణాలు ప్రపంచం దాటగా,

మనసుల మధ్య మైత్రి మాలికలు ముడిపెడుతూ,

అక్షరాల సేతువులను అహర్నిశం నిర్మిస్తూ.


ప్రచురించెదమా పత్రికల పుటలందు —

మన కలాల రాతలను కాంతులై మెరిపిస్తూ,

చరిత్ర చెక్కే చరణాల్లా నిలబెడుతూ,

కాలం కౌగిలిలో కవిత్వాన్ని నిలుపుతూ.


మనం అల్లిన ప్రతి అక్షరం — పుష్పంగా మారాలి,

మనం విప్పిన గళం — పరవశంగా పరిమళించాలి,

మన కవిత్వం — మనుగడకు మార్గదర్శకమవ్వాలి,

మనసుల మధ్య మానవత్వాన్ని మేల్కొలపాలి!


— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments

Popular posts from this blog