దోమల కాటులు — సమాజపు గాటులు (వ్యంగ్య కవిత)


దోమలున్నాయి జాగ్రత్త —

మన చుట్టూ తిరుగుతున్నాయి,

మనమే వేసిన చెత్తలో

వాటి సామ్రాజ్యం పెంచుకుంటున్నాయి!


దోమలు ఇళ్లలోకి వస్తాయి —

ఆహ్వానం లేకుండానే,

మన గుమ్మం ముందు నిలిచిన

మురుగు నీళ్ల పిలుపుతోనే.


దోమలు చుట్టూ తిరుగుతాయి —

మంత్రుల కాన్వాయిలా గోల చేస్తూ,

చెవిలో గుసగుసలాడుతూ

మన నిద్రపై పన్ను వేస్తూ.


దోమలు కాటులు వేస్తాయి —

పన్ను వసూలుదారుల్లా,

మన రక్తాన్ని వడ్డీతో

వసూలు చేస్తున్నట్టుగా!


దోమలు రోగాల దూతలు —

జ్వరాల జెండా పట్టుకుని,

మన నిర్లక్ష్యాన్ని

సొమ్ము చేసుకుంటూ వస్తాయి.


అందుకే —

దోమల నుంచి రక్షించుకో,

మురుగు నీళ్లు నిల్వనివ్వకు,

స్వచ్ఛతనే ఆయుధంగా ఎత్తుకో.


జనులారా… ఇంకో జాగ్రత్త కూడా అవసరము!

మన మధ్యా మశకాల్లాంటి వారున్నారు —

కాటులు వేసే కామందులున్నారు,

నెత్తురు త్రాగే నరరూప రాక్షసులున్నారు!



దోమల కోసం

ఉన్నాయి కాయిల్స్‌, స్ప్రేలు, దోమతెరలు …

మనుషుల మశకాల కోసం

కనిపెట్టాలి అస్త్రశస్త్రాలు మందుమాకులు!


— గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog