కలాల కూర్పులు


కలాలు అల్లిన పదునైన అక్షరాలు —

పగిలిన మౌనాలను పలికిస్తాయి,

నిద్రలో ఉన్న నిజాలను

నిగర్విగా నిలబెడతాయి.


కలాలు వాడిన పదునైన పదాలు —

పొరలైన అబద్ధాలను తొలగిస్తాయి,

మాయమాటల ముసుగులను

మెల్లగా చీల్చి చూపిస్తాయి.


కలాలు తెలిపిన పదునైన భావాలు —

మనసుల మర్మాలను తడిమేస్తాయి,

నిర్లిప్తంగా నిలిచిన హృదయాల్లో

నిజం మంటలు రాజేస్తాయి.


కలాలు వదిలిన పదునైన మాటలు —

సమాజపు మలినాలను కడుగుతాయి,

సత్యపు కాంతిని

సర్వదిక్కులా పరచుతాయి.


కలాలు కూర్చిన పదునైన రాతలు —

కాలపు చెక్కిళ్లపై చెక్కుతాయి,

కాలుష్యపు గోడలపై

కవిత్వపు కిరణాలు చిమ్ముతాయి.


కలాలు పేర్చిన పదునైన కవనాలు —

చీకట్ల గుండెల్లో వెలుగు నాటుతాయి,

మనుష్యత్వం మళ్లీ మొలిచేలా

మనసుల నేలను మేల్కొలుపుతాయి.


కలాలు కదిలితే —

కుర్చీలు కూడా కదులుతాయి,

కలాలు పదునెక్కితే —

కప్పుకున్న ముసుగులు జారిపోతాయి.


కలాలు కురిస్తే —

అబద్ధాల మేడలు కూలిపడతాయి,

కలాలు మెరిస్తే —

నిజాలే నిత్యంగా నిలిచిపోతాయి.


కలం వ్రాతలు కళ్ళను కట్టిపడేస్తాయి,

కలం చేతలు కనువిప్పు కలిగిస్తాయి;

కలం మోతలు కర్ణాలకు కమ్మదనమిస్తాయి,

కలం పోతలు కలనామృతం కురిపిస్తాయి.


– గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog