అక్షరసౌభాగ్యం
అదృష్టం వరించింది —
అనుకున్న దారి తెరచింది,
అవకాశం చిక్కింది —
ఆశయాలకు రెక్కలు తొడిగింది॥
ఆందలం ఎక్కించింది —
ఆత్మవిశ్వాసాన్ని పెంచింది,
ఆకాశం అందించింది —
ఆకాంక్షలకు హద్దులు చెరిపింది॥
అనురాగం పెంచింది —
అనుబంధాలను పరిమళింపజేసింది,
అభిమానం దక్కింది —
అందరి హృదయాల్లో స్థానం కల్పించింది॥
అంతరంగం తృప్తిపడింది —
ఆనందసుధలు నింపింది,
అత్యున్నత స్థానం లభించింది —
అక్షరాల్లో చిరస్థాయిగా నిలిపింది॥
శ్రమకు శ్రేయస్సు తోడైతే —
సఫలత సొంతమవుతుంది,
సంకల్పానికి అదృష్టం జతకడితే —
జీవితం సువర్ణగాథ అవుతుంది॥
అవకాశాన్ని అందిపుచ్చుకున్నవారికి —
అభ్యుదయం అండగా నిలుస్తుంది,
అంకితభావంతో ముందడుగు వేసినవారికి —
అజరామరమైన కీర్తి చిరునామా అవుతుంది॥
అక్షరాలు అంకురించాయి —
ఆలోచనలు ఆవిష్కృతమయ్యాయి,
పదాలు పుష్పించాయి —
భావపరిమళాలు వెదజల్లాయి॥
కలం కదిలింది —
కాగితాలు కవితామయమయ్యాయి,
కవితలు కురిశాయి —
కలలు సాకారమయ్యాయి॥
పలుకులమ్మకు వందనాలు —
పాఠకలోకానికి కృతజ్ఞతలు,
ప్రచారమాధ్యమాలకు ప్రణామాలు —
ప్రశంసకులకు అభివందనాలు॥
ఇది కేవలం అదృష్టగాథ కాదు —
అక్షరదేవత అనుగ్రహ వైభవం,
కవిత్వమే నా జీవనశ్వాసగా మారిన
దివ్యసాహితీ సౌభాగ్యం॥
✍️గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, భాగ్యనగరం ✍️

Comments
Post a Comment