వానదేవా! వేగరావా!
వానకోసం వేచియున్నా —
వాడిన నేల వేదన చూస్తున్నా,
చినుకులకోసం చిటపటలాడుతున్నా —
చిగురుటాకుల చిరునవ్వు కోరుతున్నా॥
జల్లులకోసం జపం చేస్తున్నా —
జనని భూమికి జీవం అడుగుతున్నా,
వర్షంకోసం వరుణుని ప్రార్థిస్తున్నా —
వెలిసిన పొలాలకు వేడుకలు తెమ్మంటున్నా॥
జలధారలకోసం పరితపిస్తున్నా —
జీవనగీతం మళ్లీ వినాలనుకుంటున్నా,
చల్లదనంకోసం కాచుకొనియున్నా —
చెమటబిందువులకు విముక్తి కోరుతున్నా॥
మేఘమాలలు కమ్ముకొస్తే —
మనసంతా మురిసిపోతుంది,
ఉరుముల నాదం వినిపిస్తే —
ఆశల పల్లకి ఊరేగుతుంది॥
మొదటి చినుకు నేలను తాకితే —
మట్టిపరిమళం మైమరపిస్తుంది,
మొదటి జల్లు గుమ్మం చేరితే —
ఇంటిల్లిపాదీ హర్షం పంచుతుంది॥
పొలాల్లో పచ్చదనం పూస్తుంది —
పంటలకు ప్రాణం పోస్తుంది,
చెరువుల్లో అలల సందడి —
చెలిమిగా పాటలు పాడుతుంది॥
రావే వానా! రమ్యంగా రావే —
రైతన్న గుండెను రంజింపజేయవే,
కురిసే జలధారలతో —
కోటి ప్రాణాలకు కల్పవల్లివై నిలువవే॥
భూమాత ఒడిలో
పచ్చని సోయగాలు నింపించవే,
ప్రతి గుండెలో
ఆనంద గంగలు పొంగించవే॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments
Post a Comment