గానామృతం


ఓంకారనాదాలు చేయనా —

ఒలికే బ్రహ్మతత్త్వం పలుకనా,

ఆదిమధ్యాంత రహిత స్వరంతో

అంతరంగాలను వెలిగించనా॥


వీణానాదాలు మీటనా —

విద్యాదేవిని స్తుతించనా,

తంతులతాకిడిలో తీయనిభావాలు

హృదయ తరంగాలుగా పారించనా॥


శంఖారావాలు పూరించనా —

శుభవేళల సందేశాలు చాటనా,

మంగళధ్వనుల మకరందాన్ని

మనసుల తోటల్లో చల్లనా॥


గాంధర్వగానాలు వినిపించనా —

గగనవీధుల్లో విహరించనా,

స్వరసుధల జలపాతాలతో

శ్రోతల హృదయాలు తడిపెయ్యనా॥


శ్రావ్యరాగాలు సంధించనా —

శృతిలయాల సేతువులు కట్టనా,

సప్తస్వరాల సోయగాలతో

సంగీతసరస్సును నింపనా॥


కూనిరాగాలు తీయనా —

కోకిలగానపు మాధుర్యం పంచనా,

చిరునవ్వుల చిగురాకులపై

చినుకుల పాటలు కురిపించనా॥


ప్రేమగీతాలు ఆలపించనా —

ప్రణయసుధలను పారించనా,

రెండు హృదయాల మధ్యన

అనురాగ దీపాలు వెలిగించనా॥


భక్తిగీతాలు పాడనా —

భవసాగరానికి పడవనవ్వనా,

దైవనామ స్మరణామృతంతో

భక్తుల మనసులు పులకింపజేయనా॥


జనగళాలు ఎత్తుకోనా —

జన్మభూమి జయగాథలు పలుకనా,

సమతా సందేశాల సవ్వడిగా

సమాజ శ్రేయస్సు కోరనా॥


విప్లవగళాలు నినదించనా —

వివేక జ్యోతులు రగిలించనా,

అన్యాయాల అంధకారంపై

అక్షరాయుధమై నిలవనా॥


మనసుపాట ముందుంచనా —

మానసాలను మురిపించనా,

హృదయవీణ తంత్రులపై

భావరాగాలు పలికించనా॥


జీవితపాట వెలువరించనా —

జీవనసత్యాలు తెలుపనా,

అనుభవాల అక్షరమాలికతో

ఆదర్శమార్గాలు చూపించనా॥


గానం నా గుండె ఆక్రందం —

స్వరం నా జీవన స్పందనం,

పాటే నా ప్రాణనాదం —

పరమానందమే నా గానామృతం॥


సప్తస్వరాల సౌరభాలతో

సకల జగతిని అలరించనా,

మానవత్వ మాధుర్యాన్ని

మధుగీతమై వినిపించనా॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog