లోకం...


లోకం — కనులకు కాంతులు పంచే చిత్రపటం,

ప్రతి దృశ్యం ఒక కథ,

ప్రతి క్షణం ఒక సందేశం॥


లోకం — వీనులకు విందులు అందించే సంగీతమందిరం,

గాలుల గుసగుసలు, పక్షుల కిలకిలరావాలు,

మనసును మురిపించే మధురస్వరాలు॥


లోకం — రంగుల కలలకు పిలిచే ఆహ్వానపత్రం,

కొత్త మార్గాలను పరిచయం చేయటం,

కుతూహలాలకు రెక్కలు తొడగటం ధ్యేయం॥


లోకం — నిద్రించిన ఆశల మేల్కొలుపు గీతం,

పడిపోయిన అడుగులను లేవదీసి,

ముందుకు సాగమని ప్రేరేపించే మార్గదర్శి॥


లోకం — ప్రకృతి ప్రసాదాల పంచిపెట్టే పుణ్యక్షేత్రం,

ఆకలి తీర్చే అన్నపూర్ణ,

అందరికీ ఆత్మీయత అందించే అమృతవల్లీ॥


లోకం — కొండలు, కోనలు, నదుల సమూహం,

అనుభవాల ఆణిముత్యాలను అందించి,

జీవితాన్ని సార్థకం చేయించే స్థావరం॥


లోకం — హృదయాలకు హృదయాలను కలిపే సేతకం,

స్నేహం, అనురాగం, ఆప్యాయతల నిలయం,

మనిషితనాన్ని పరిమళింపజేసే ఉద్యానవనం॥


లోకం — బాధలో భుజం తడుతుంది,

సంతోషంలో చిరునవ్వు పంచుతుంది,

సహజీవన సౌందర్యాన్ని చాటుతుంది॥


అయితే లోకం అంతా ఇదే కాదు —

నవ్వుల్లో కన్నీళ్లు దాగుంటాయి, వెలుగుల్లో నీడలు చేరుతాయి,

విజయాల వెనుక వైఫల్యాలు నిలుస్తాయి॥


అందుకే లోకం — కనబడినదంతా నిజం కాదని,

వినబడినదంతా సత్యం కాదని, అనుభవమే అసలైన గురువని,

అడుగడుగునా బోధించే అద్భుత జీవన విశ్వవిద్యాలయం॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం. 


Comments

Popular posts from this blog