కవి యానం


కవి చుక్కాని పట్టుకున్నాడు —

చింతన నావను నడిపిస్తున్నాడు,

దిక్సూచి చూస్తున్నాడు —

దిశానిర్దేశాల వెలుగులు పంచుతున్నాడు॥


కవి విషయాలు వెదుకుతున్నాడు —

విశ్వమంతా విహరిస్తున్నాడు,

అనుభవాల ముత్యాలను ఏరుకుంటున్నాడు —

అక్షరహారాలను అల్లుతున్నాడు॥


కవి ప్రకృతిని పలకరిస్తున్నాడు —

పరవశ గీతాలు రాస్తున్నాడు,

పల్లెల పొలాల పరిమళాలను పంచుతున్నాడు —

కవితాపుటల్లో పరచుతున్నాడు॥


కవి మనుషులను గమనిస్తున్నాడు —

మనసుల లోతులు కొలుస్తున్నాడు,

నవ్వుల్లోని మాధుర్యాన్ని చాటుతున్నాడు —

కన్నీళ్లలోని కారుణ్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు॥


కవి కాలంతో పాటు నడుస్తున్నాడు —

కథలను కవితలుగా మలుస్తున్నాడు,

సమాజ స్పందనలను గ్రహిస్తున్నాడు —

సత్యస్వరాలను వినిపిస్తున్నాడు॥


కవి ప్రయాణం సాగిస్తున్నాడు —

ప్రపంచాన్ని పాఠశాలగా చేసుకున్నాడు,

ప్రతి అడుగును అనుభవంగా మలుస్తున్నాడు —

ప్రతి క్షణాన్ని అక్షరబద్ధం చేస్తున్నాడు॥


కవి కవితలు కూర్చుతున్నాడు —

కల్పనలకు రెక్కలు తొడుగుతున్నాడు,

భావాలకు భాషను ఇస్తున్నాడు —

భవ్యదివ్య కావ్యాలను విరచిస్తున్నాడు॥


కవి కలం కదిలిస్తున్నాడు —

కవనజల్లులు కురిపిస్తున్నాడు,

కవి హృదయం విప్పుతున్నాడు —

కొత్త లోకాలు చూపిస్తున్నాడు॥


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog