నచ్చేలా...
నచ్చేలా మాట్లాడుతా —
నవ్వులు పూయించే మాటలు పలుకుతా,
మనసులను గెలుచుకునే మాధుర్యంతో
మమతల వంతెనలు వేస్తా॥
నచ్చేలా మసలుకుంటా —
మర్యాదలను మకుటంలా ధరించుకుంటా,
ఎదుటివారి భావాలను గౌరవిస్తూ
ఆత్మీయతను అందరికీ అందిస్తా॥
నచ్చేలా తయారవుతా —
అందంకంటే ఆనందం ముఖ్యం అనుకుంటా,
వ్యక్తిత్వ పరిమళాలు వెదజల్లుతూ
విలువల దీప్తితో వెలుగుతా॥
నచ్చేలా తోడ్పడుతా —
అవసరంలో అండగా నిలుస్తా,
చేతనైన సహాయంతో
చిరునవ్వులను చిగురింపజేస్తా॥
నచ్చేలా ఆడుతా —
ఆటలో ఆనందం వెదుకుతా,
గెలుపోటములను సమంగా స్వీకరిస్తూ
స్నేహబంధాలను పెంచుతా॥
నచ్చేలా పాడుతా —
రాగాలలో రసధారలు పారిస్తా,
స్వరాల సౌరభాలతో
హృదయాలను హత్తుకుంటా॥
నచ్చేలా నడుస్తా —
నిజాయితీని నీడగా చేసుకుంటా,
మంచితనాన్ని మార్గదర్శిగా చేసుకుని
మానవత్వపు బాటలో సాగుతా॥
నచ్చేలా వ్రాస్తా —
అక్షరాలకు ఆత్మను అద్దుతా,
ఆలోచనలకు ఆకారమిస్తూ
అమృతమైన భావాలను పంచుతా॥
నచ్చేలా బ్రతుకుతా —
నటన కాదు, నిజం చూపుతా,
నన్ను చూసి నలుగురు మెచ్చేలా
నవ్యమైన జీవనగీతం ఆలపిస్తా॥
నచ్చేలా మిగిలిపోతా —
మనసులతోటలో మల్లెపువ్వై పరిమళిస్తా,
మమతలవీణపై మధురస్వరమై పలుకుతా,
నన్ను కలిసిన ప్రతి హృదయంలో మరపురాని జ్ఞాపకమై నిలిచిపోతా॥
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Comments
Post a Comment